
15 శాతం వృద్ధి రేటే లక్ష్యం.. క్షేత్రస్థాయి ప్రణాళికలతో ముందుకు సాగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా మైక్రో, మాక్రో స్థాయిలో సమగ్ర ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా ఉత్పాదకతను గరిష్ట స్థాయికి పెంచాలని ఆయన స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ప్రసంగించారు.
ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించండి రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని వాటిని సమర్థంగా వినియోగించుకుని ఆదాయాన్ని వృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రతి శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉత్పాదకత పెరిగినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.
భారం పడకుండా ఆదాయం పెంచాలి
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల విద్యుత్ రంగంపై పడిన సుమారు రూ. 4,600 కోట్ల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖలు తమ లక్ష్యాలను చేరుకుంటూనే ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని సూచించారు.
కీలక ప్రాజెక్టులే సంపద మూలాలు
రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. ప్రాధాన్యత కలిగిన ఇలాంటి పనులకు నిధుల కొరత లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర పథకాలైన పూర్వోదయ, సాస్కీ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
సంక్షేమ క్యాలెండర్ ప్రకారం అన్ని పథకాలను పకడ్బందీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గతంలో నిలిపివేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 269 కేంద్రాల్లో పేదలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సులభతర విధానాలను అనుసరించాలని, ప్రతి శాఖ సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
