
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ దేశ భవిష్యత్తును మారుస్తుంది:ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దేశ రాజధాని ఢిల్లీలో అరుదైన గౌరవం దక్కింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రత్యేకంగా విమానంలో విజ్ఞాన విహారయాత్రకు ఢిల్లీ తీసుకువచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఇలాంటి పర్యటనలు విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా బాహ్య ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడానికి వారి ఆలోచనా పరిధులను విస్తరించుకోవడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఎన్నో పోరాటాలు, వైఫల్యాలు, ఎదురుదెబ్బలను తట్టుకుని పైకి వచ్చినవారేనని విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితులను చూసి ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని సూచించారు. విద్యే జీవితంలో ఉన్నత స్థానాలకు చేర్చే అత్యంత విజయవంతమైన సాధనమని జాతీయ ప్రగతికి విద్యే ప్రధాన బలమని ఆయన ఉద్ఘాటించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందన్న ఉపరాష్ట్రపతి, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే దేశ భవిష్యత్తునే మార్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మరింత దృష్టి సారించి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ సైతం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు అవసరమైన అన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉన్నారని కొనియాడారు.
ఈ వినూత్న కార్యక్రమంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం వారిని పెద్ద పెద్ద లక్ష్యాల వైపు నడిపించడమే ఈ విజ్ఞాన విహారయాత్ర ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని కలవడం ఆయనతో మాట్లాడటం తమ జీవితంలో ఎన్నటికీ మరపురాని అనుభవమని ఈ పర్యటన తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని విద్యార్థులు అత్యంత ఆనందం వ్యక్తం చేశారు.
