
తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి
ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఎట్టకేలకు వాణిజ్య నౌకల రాకపోకల కోసం సిద్ధమైంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా, ఈ కీలక జలమార్గాన్ని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 10 శాతం మేర భారీగా పతనమవ్వగా, స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
వాణిజ్య నౌకలకు ఇరాన్ పచ్చజెండా
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ 'ఎక్స్' వేదికగా ధ్రువీకరించారు. "లెబనాన్ కాల్పుల విరమణకు అనుగుణంగా, వాణిజ్య నౌకల రాకపోకల కోసం జలసంధిని తెరిచాం. కాల్పుల విరమణ కొనసాగినంత కాలం ఇది అమల్లో ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. అయితే, నౌకలు ప్రయాణించేటప్పుడు ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన 'సమన్వయ మార్గాల్లోనే' వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "హోర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిస్థాయి రాకపోకలకు సిద్ధంగా ఉంది. ఇరాన్ చేసిన ఈ ప్రకటన సంతోషకరం" అంటూవెల్లడించారు.
అమెరికా దిగ్బంధం కొనసాగింపు
జలసంధిని వాణిజ్య అవసరాలకు అనుమతించినప్పటికీ, ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు 100 శాతం సఫలమయ్యే వరకు ఇరాన్ తీరప్రాంతంపై తమ పట్టు సడలించబోమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత చర్చలు వేగంగా సాగుతున్నాయని, చాలా అంశాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యూఎస్ సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం, సుమారు 10,000 మంది సైనికులు, 100కు పైగా విమానాలు, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ నౌకలతో ఇరాన్ తీరప్రాంతాన్ని అమెరికా పహారా కాస్తోంది. లాస్ వెగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతిన్నదని, వారి 158 నౌకలు సముద్ర గర్భంలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
యురేనియం అప్పగింతకు ఇరాన్ అంగీకారం?
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో అత్యంత కీలకమైన అంశం అణు కార్యక్రమం. ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉందని, తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన శుద్ధి చేసిన యురేనియం (న్యూక్లియర్ డస్ట్) నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేకుండానే శాశ్వత ఒప్పందం కుదిరేలా తాము ప్రయత్నిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ దౌత్య వ్యూహం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో పర్యటించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్‌లతో భేటీ అయ్యారు. అమెరికా పంపిన ప్రత్యేక సందేశాన్ని వారికి చేరవేసినట్లు సమాచారం. వచ్చే వారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఒప్పందం కుదిరితే ట్రంప్ పర్యటన?
ఒకవేళ ఇరాన్‌తో తుది శాంతి ఒప్పందం కుదిరితే తాను ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధమని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం విశేషం. "ఇరాన్ దాదాపు అన్ని షరతులకు అంగీకరించింది. ఒప్పందం సంతకం చేయడానికి వారు నన్ను ఆహ్వానిస్తున్నారు" అని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 21తో అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఈ లోపే శాశ్వత పరిష్కారం లభిస్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
లెబనాన్ సరిహద్దుల్లో శాంతి శకటం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌లతో ట్రంప్ జరిపిన 'అద్భుతమైన' ఫోన్ సంభాషణల తర్వాతే 10 రోజుల కాల్పుల విరమణ సాధ్యమైంది. రాబోయే నాలుగు ఐదు రోజుల్లో ఈ ఇద్దరు నేతలు వైట్ హౌస్ వేదికగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కాల్పుల విరమణే ఇరాన్‌తో యుద్ధం ముగియడానికి తొలి మెట్టుగా అమెరికా భావిస్తోంది.
లెబనాన్ రాజధాని బీరూట్‌లో అర్ధరాత్రి నుంచే సంబరాలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఇళ్లు వదిలి వెళ్లిన ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు మాత్రం ఇజ్రాయెల్ ఇంకా కొన్ని చోట్ల ఫిరంగి దాడులు చేస్తోందని ఆరోపించాయి. మరోవైపు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, కాల్పుల విరమణను గౌరవిస్తామని చెప్తూనే.. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల మేర 'బఫర్ జోన్'లో తమ సైన్యం కొనసాగుతుందని, హెజ్బొల్లాను పూర్తిగా నిరాయుధులను చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
శాశ్వత పరిష్కారం కావాలన్న ఐరోపా
హోర్ముజ్ జలసంధిని తెరవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వాగతించారు. అయితే ఈ నిర్ణయం కేవలం తాత్కాలికం కాకుండా 'శాశ్వతం' కావాలని వారు డిమాండ్ చేశారు. సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి వచ్చే వారం లండన్‌లో అంతర్జాతీయ సైనిక నిపుణుల సమావేశం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.
ఉద్రిక్తతల నేపథ్యం
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయింది. తాజా పరిణామాలతో మళ్లీ సాధారణ స్థితి వస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.
