

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద విద్రోహి: కవిత
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ప్రతిష్టాత్మక "బాయిబాట" కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల కోల్ బెల్ట్ ప్రాంతంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆమె అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్‌ను సందర్శించి, భూగర్భ గనిలోకి వెళ్లి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. కార్మికులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
అనంతరం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థకు ప్రస్తుత ప్రభుత్వమే పెద్ద విద్రోహిగా మారిందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం సంస్థకు సుమారు రూ. 50 వేల కోట్ల బకాయిలు పెట్టడం వల్లే సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు, సరైన పనిముట్లు కల్పించడం లేదు. మ్యాన్ చైర్ పై 45 నిమిషాల పాటు ప్రయాణించడం వల్ల కార్మికులు తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను కలవడానికి వస్తే పోలీసులు, ఆఫీసర్లను పెట్టి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ మీటింగ్‌కు వస్తే జీతం కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, కార్మికుల జీతం కట్ చేస్తే అక్కడే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికుల హక్కుల కోసం ‘హెచ్ఎంఎస్’ కూటమిని గెలిపించాలని, కార్మికులు కాలర్ ఎగిరేసుకునేలా చేస్తామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు ముగ్గురూ బందిపోటు దొంగల్లా మారి సింగరేణి ప్రాంత వనరులను, ఇసుక, మట్టి, బూడిదను దోచుకుంటున్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే వారి కుటుంబ సభ్యులు ‘బై వన్ గెట్ వన్’ లాగా వచ్చి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ లంచాలు అడుగుతున్నారని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు గతంలో ఉద్యమ సమయంలో తమను అడ్డుకుంటే ప్రజలు వెంటబడి ఓడించారని, ఇప్పుడు మళ్లీ కార్మికులకు, మాకు మధ్యకు వస్తే ఖబడ్దార్, మరోసారి ఓడిస్తామని హెచ్చరించారు.
రైతాంగంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో వరి కుప్పల పైనే రైతుల గుండె ఆగిపోతోందని, మిల్లుల్లో వడ్లు కొనకపోవడంతో యువరైతు సంతోష్ లాంటి వారు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి, ఇప్పుడు కేవలం 7 రకాల వడ్లకే ఇస్తామనడం మోసమన్నారు. వ్యవసాయానికి తీవ్ర ఆటంకంగా మారిన "యూరియా యాప్"ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మే నెలలో రావాల్సిన యూరియా కోసం వచ్చే నెల ఢిల్లీ వెళ్తామనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
చివరగా, రాష్ట్రంలో 15 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేసిందని, ఇది బీఆర్ఎస్ హయాం నాటి తప్పులనే పునరావృతం చేయడమేనని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ ‘తెలంగాణ రక్షణ సేన’ ఎదగబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.
