Let's talk: editor@tmv.in
కూటమి ప్రభుత్వంలో మాటలకే పరిమితమైన పొదుపు మంత్రం: వైసీపీ

కూటమి ప్రభుత్వంలో మాటలకే పరిమితమైన పొదుపు మంత్రం: వైసీపీ

Panthagani Anusha
24 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం వాస్తవ పాలనను గాలికొదిలేసి కేవలం ప్రచార రాజకీయాలకే పెద్దపీట వేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్న పొదుపు మంత్రానికి ఆయన మంత్రులు, నేతల క్షేత్రస్థాయి విలాసాలకు అస్సలు పొంతన లేదని పార్టీ మండిపడింది. ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామనే పేరుతో విదేశీ పర్యటనలను రద్దు చేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని వైసీపీ ఆరోపించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పొదుపు, ఇంధన సంరక్షణ, సైక్లింగ్, నడక, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం“నో వెహికల్ ఫ్రైడే” వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పెద్ద పెద్ద సుద్దులు చెప్తున్నారని పార్టీ ఎద్దేవా చేసింది. అదే సమయంలో కొందరు మంత్రులు, కూటమి నేతలు తాము రైలు ప్రయాణాలు చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లు చేయడం సిగ్గుచేటని విమర్శించింది. ప్రభుత్వ ప్రకటనలు నేతల ప్రవర్తన మధ్య ఉన్న వ్యత్యాసం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు.

అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమదాలవలస పర్యటన సందర్భంగా పర్యావరణ సూత్రాలను తుంగలో తొక్కి భారీ వాహన కాన్వాయ్‌లు, అట్టహాస రోడ్‌షోలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పార్టీ మండిపడింది. మరోవైపు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమాన ప్రయాణాలు విలాసవంతమైన విదేశీ పర్యటనలు కొనసాగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అదేవిదంగా సింగపూర్, రష్యా వంటి దేశాల పర్యటనలు, వీఐపీ కాన్వాయ్‌లు, ప్రత్యేక విమానాల వినియోగం, నిరంతర ప్రచార కార్యక్రమాలు ప్రభుత్వం చెప్తున్న పొదుపు సందేశానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వైసీపీ పేర్కొంది.

రాష్ట్రంలో ప్రజలకు నియమాలు, కూటమి నాయకులకు మినహాయింపులు అనే చందంగా పాలన సాగుతోందని పార్టీ విమర్శించింది. ప్రజలకు త్యాగాలు, పొదుపు గురించి బోధిస్తున్న నాయకత్వం తాము మాత్రం ఆడంబరాలకు లగ్జరీ జీవితాలకు దూరంగా ఉండలేకపోతోందని ధ్వజమెత్తింది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, కేవలం సోషల్ మీడియా కెమెరాల ప్రచారానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ప్రచార ఆర్బాటాలను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ పార్టీ నేతలు స్పష్టం చేశారు.