Let's talk: editor@tmv.in
ఆ సీనియర్ నేత‌ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఎవరీ మఖన్‌లాల్‌ సర్కార్?
ఆ సీనియర్ నేత‌ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఎవరీ మఖన్‌లాల్‌ సర్కార్?

ఆ సీనియర్ నేత‌ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఎవరీ మఖన్‌లాల్‌ సర్కార్?

Gaddamidi Naveen
10 మే, 2026

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా శనివారం జరిగిన వేడుకలో పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై, బెంగాల్‌లో 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) యుగం ప్రారంభమైందని ప్రకటించారు.

వయోవృద్ధ కార్యకర్త మాఖన్‌లాల్ సర్కార్‌కు సత్కారం

ఈ వేడుకలో ఒక అపురూప దృశ్యం చోటుచేసుకుంది. 98 ఏళ్ల వయస్సు గల బీజేపీ సీనియర్ నేత‌ మఖన్‌లాల్‌ సర్కార్‌ను ప్రధాని మోడీ స్వయంగా సత్కరించి, ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాతంత్య్రానంతర భారత జాతీయవాద ఉద్యమంలో మఖన్‌లాల్‌ కీలక పాత్ర పోషించారు. 1952లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే క్రమంలో ఆయన అరెస్టయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత కేవలం ఏడాది కాలంలోనే పశ్చిమ దినాజ్‌పూర్, డార్జిలింగ్ ప్రాంతాల్లో 10,000 మంది సభ్యులను చేర్పించిన ఘనత ఆయనది. ఏడేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన అంకితభావానికి ప్రధాని ఈ గౌరవాన్ని అందించారు.

ప్రధాని మోడీ ఎక్స్ లో స్పందిస్తూ.. ప్రమాణ స్వీకార వేడుకలో భాగంగా, పార్టీ సీనియర్ నేత‌ మఖన్‌లాల్‌ సర్కార్ ని కలిసే అవకాశం కలగడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తన జీవితాంతం పార్టీ కోసం అంకితమై, పశ్చిమ బెంగాల్‌లోని నలుమూలలా బీజేపీ మూలాలను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి చేరేలా ఆయన స్ఫూర్తినిచ్చారని తెలిపారు. బీజేపీ అభివృద్ధిలో ఇలాంటి మహోన్నత వ్యక్తుల కృషి ఎంతో ఉందని, ప్రజల మధ్య ఉండి పార్టీని బలోపేతం చేసిన ఇటువంటి స్ఫూర్తిదాయక నేతలు ఉన్నందుకు తాము గర్విస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, 15 ఏళ్ల పాటు పాలించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 80 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ పోటీ చేసి, మమతా బెనర్జీని 15,000 ఓట్ల మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు.