
మత్స్యకారుల హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది:మంత్రి అచ్చెన్నాయుడు
మత్స్యకారుల కడుపు నింపింది కూటమి ప్రభుత్వమేనని గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మత్స్యకార రంగాన్ని పూర్తిగా కుదేలు చేశారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత్స్యకారుల హక్కులను కాలరాసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని మండిపడ్డారు. జువ్వలదిన్నె హార్బర్ వేదికగా జగన్ పచ్చి అబద్ధాలు ఆడారని గత ప్రభుత్వం చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం కడిగివేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర నిధుల దారి మళ్లింపు
హార్బర్ల అభివృద్ధికి రాష్ట్ర వాటా ఉపయోగించకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 128 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే ఇతర రాయితీలకు ఆటంకం ఏర్పడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బకాయిలను తక్షణమే విడుదల చేసి మత్స్యకార రంగాన్ని ఆదుకుందని తెలిపారు.
ఆర్థిక భరోసా - సంక్షేమ పథకాలు
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వివరించారు. గతంలో ఉన్న రూ.10 వేల వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచి లక్షలాది కుటుంబాలకు భరోసానిచ్చాం. ఒకే ఏడాదిలో రూ. 242 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని నేరుగా అందించాం. డీజిల్ సబ్సిడీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తూ లీటరుకు రూ.9 చొప్పున వేలాది పడవలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. సామాజిక భద్రతా పెన్షన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచాం అని ఆయన పేర్కొన్నారు.
పెండింగ్ క్లెయిమ్స్ క్లియర్
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల ప్రమాద మరణ పరిహారం క్లెయిమ్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా 2024-25లో రూ. 3.15 కోట్లు, 2025-26లో రూ. 5.65 కోట్లను బాధిత కుటుంబాలకు అందజేసి న్యాయం చేశామన్నారు.
రూ. 3,328 కోట్లతో హార్బర్ల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. 2015-16లోనే తాము రూపొందించిన ప్రణాళికల ప్రకారం ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం రూ. 3,328.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల పనులు కొనసాగుతున్నాయని, వీటితో పాటు ట్రాన్స్‌పాండర్లు, కృత్రిమ రీఫ్స్, డీప్ సీ ఫిషింగ్ పడవల పంపిణీ వంటి కార్యక్రమాలతో మత్స్య రంగానికి కొత్త ఊపునిస్తున్నామని ఆయన వివరించారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణంలో గత ప్రభుత్వ జాప్యాన్ని చెరిపివేసి పనులను పరుగులు పెట్టిస్తున్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
