
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి: మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 'ఒలింపిక్ డే రన్-2026' కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, నగరం నలుమూలల నుంచి ఒలింపిక్ జ్యోతిని స్టేడియానికి తీసుకువచ్చిన ప్రతి క్రీడాకారుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరిలో క్రీడా నినాదాన్ని, ఒలింపిక్ స్ఫూర్తిని నింపే అద్భుత లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్ డే రన్ కేవలం క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మిలిటరీ సైనికులకు ఉండే స్థాయి క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని, అప్పుడే వారు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించగలరని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల పాలనలో క్రీడారంగానికి అపూర్వ ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి వివరించారు. రాబోయే 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలతో పనిచేస్తోందని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న అసలైన క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు మా ప్రభుత్వం 'సీఎం కప్' రెండు ఎడిషన్లను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. క్రీడల అభివృద్ధికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒలింపిక్ డే అందించే క్రీడా స్ఫూర్తిని కేవలం మైదానాలకే పరిమితం చేయకుండా ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
