Let's talk: editor@tmv.in
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి హరీష్ రావు

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
8 జూన్, 2026

పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు “కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అని కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేయడంతో లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో రైతులు 45 రోజులపాటు కొనుగోలు కేంద్రాల వద్ద వేచిచూడాల్సి వచ్చిందని, ఇప్పటికీ పెద్దఎత్తున ధాన్యం కల్లాల్లోనే ఉందని అన్నారు.

కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిరాశపరిచిందని విమర్శించారు. రుణమాఫీపై ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ఎరువుల సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా రైతులు మళ్లీ క్యూల్లో నిలబడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపుల్లో జాప్యం వల్ల వేలాది రైతు కుటుంబాలు నష్టపోయాయని హరీష్ రావు ఆరోపించారు. కొత్తగా తీసుకొస్తున్న ‘రైతు డిస్కం’ విధానం వ్యవసాయ రంగానికి నష్టం కలిగిస్తుందని, కేసీఆర్ అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్‌కు ముప్పు ఏర్పడిందన్నారు. కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి విలువ 50 నుంచి 60 లక్షలు ఉంటే, నేడు కాంగ్రెస్ పాలనలో అది సగానికి పడిపోయిందన్నారు.

రేవంత్ రెడ్డిది నయా హిట్లర్ పాలన

హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా పెట్టానని రేవంత్ రెడ్డి అనడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నేటి నయా హిట్లర్ రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదని హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని, ఈ క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.