Let's talk: editor@tmv.in
భారత్‌లో 2.5 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టనున్న మధ్యప్రాచ్య సంక్షోభం!

భారత్‌లో 2.5 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టనున్న మధ్యప్రాచ్య సంక్షోభం!

Dantu Vijaya Lakshmi Prasanna
15 ఏప్రిల్, 2026

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై, పేదల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ మేరకు విడుదలైన 'మిలిటరీ ఎస్కలేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్: హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్స్ అక్రాస్ ఆసియా అండ్ ద పసిఫిక్' అనే నివేదికలోని ఈ విషయాలను వెల్లడించింది.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు భారతదేశంలో దాదాపు 25 లక్షల (2.5 మిలియన్లు) మందిని కొత్తగా పేదరికంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం భారత్‌లో పేదల సంఖ్య సుమారు 35.15 కోట్లుగా ఉండగా, ఈ సంక్షోభం కారణంగా అది 35.40 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే దేశ పేదరిక రేటు 23.9 శాతం నుంచి 24.2 శాతానికి చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది.

మానవాభివృద్ధి సూచీపై ప్రభావం

యుద్ధం కేవలం ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తుంది. భారతదేశం తన మానవాభివృద్ధి పురోగతిలో (హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్) సుమారు 0.03 నుంచి 0.12 సంవత్సరాల కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే భారత్ సాధించాల్సిన అభివృద్ధి వెనక్కి మళ్లుతుందని అర్థం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇరాన్ తర్వాత భారత్, నేపాల్, వియత్నాం వంటి దేశాలు ఈ విషయంలో ఎక్కువ నష్టపోతాయని నివేదిక హెచ్చరించింది.

ఇంధన, ఎరువుల భారం

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో 40 శాతం చమురు, 90 శాతం ఎల్‌పీజీ పశ్చిమాసియా నుంచే వస్తోంది. యుద్ధం కారణంగా వీటి ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. అంతేకాకుండా, వ్యవసాయానికి కీలకమైన ఎరువుల దిగుమతుల్లో 45 శాతం వాటా ఆ దేశాలదే. దేశీయ యూరియా ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ దిగుమతులపై యుద్ధ ప్రభావం పడితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిపింది.

వ్యవసాయం, ఆహార భద్రత

రాబోయే ఖరీఫ్ సీజన్(జూన్ నెల)భారత్‌కు అత్యంత కీలకం. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే యూరియా, ఇతర ఎరువుల కొరత ఏర్పడి సాగుపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు కొంతకాలం సరిపోయినా, సుదీర్ఘ సంక్షోభం ఎదురైతే పంట దిగుబడి తగ్గి, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఇది దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, పేద ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుందని నివేదిక పేర్కొంది.

ఎగుమతులు, వాణిజ్య విఘాతం

పశ్చిమాసియా మార్కెట్లు భారతదేశ ఎగుమతుల్లో 14 శాతం, దిగుమతుల్లో 20.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బాస్మతీ బియ్యం, టీ, రత్నాలు, ఆభరణాలు, దుస్తుల వంటి సుమారు 48 బిలియన్ డాలర్ల విలువైన చమురుేతర ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడం వల్ల సరుకు రవాణా ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగిపోతున్నాయి, ఇది వ్యాపారులకు, ప్రభుత్వానికి భారంగా మారుతుందని తెలిపింది.

రెమిటెన్స్ (విదేశీ నగదు) తగ్గుదల

గల్ఫ్ దేశాల్లో సుమారు 93.7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత్‌కు వచ్చే మొత్తం విదేశీ నగదులో 38-40 శాతం వాటా వీరిదే. యుద్ధం వల్ల అక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతింటే, స్వదేశానికి పంపే నగదు తగ్గుతుంది. ఇది కేవలం ఆ కుటుంబాలనే కాకుండా, దేశ విదేశీ మారక నిల్వలను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది.

భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ సంక్షోభానికి ఎక్కువగా ప్రభావితమవుతాయి. నిర్మాణ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ తయారీ, వజ్రాల పరిశ్రమల్లో పనిచేసే అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ముడి పదార్థాల ధరలు పెరగడం, ఆర్డర్లు రద్దు కావడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు మూతపడే అవకాశం ఉంది, ఇది నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది.

ఈ యుద్ధం ప్రజల ఆరోగ్యంపై కూడా భారం వేస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణా ఆటంకాల వల్ల వైద్య పరికరాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పటికే దేశంలో మందుల హోల్ సేల్ ధరలు 10-15 శాతం పెరిగాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఈ పెరిగిన వైద్య ఖర్చులు మరింత భారంగా మారతాయని తెలిపింది.

పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే ఆ ప్రభావం నేరుగా భారత సామాన్యుడి గడప వరకు చేరుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇంధన వనరుల వైవిధ్యీకరణ, స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, సామాజిక భద్రతా పథకాలను పటిష్టం చేయడం ద్వారానే భారత్ ఈ గండం నుంచి గట్టెక్కగలదని ఐక్యరాజ్యసమితి సూచించింది.