Let's talk: editor@tmv.in
చట్టం ఎవరినీ వదిలిపెట్టదు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి

చట్టం ఎవరినీ వదిలిపెట్టదు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి

Gaddamidi Naveen
14 మే, 2026

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి బుధవారం ఘాటుగా స్పందించారు. నిందితుడు ఎక్కడ దాక్కున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని, బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

"తప్పు చేస్తే తన కుమారుడినైనా వదిలిపెట్టవద్దు" అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. మీరు అంతగా కట్టుబడి ఉంటే, పరారీలో ఉన్న మీ కుమారుడిని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించండి అని సవాల్ విసిరారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన గుర్తు చేశారు. గతంలో సంధ్యా థియేటర్ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్న విషయాన్ని ఉదాహరణగా చూపుతూ, ఈ కేసులో కూడా సిట్ ద్వారా నిష్పక్షపాత విచారణ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు. తనపై నమోదైన కేసు రూ.5 కోట్ల వసూళ్ల కోసం పెట్టిన ప్రతీకార కేసు అని ఆయన వాదిస్తున్నారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసులు నమోదు అయ్యాయి.