Let's talk: editor@tmv.in
మీడియా రంగంపై ‘ఏఐ’ ప్రభావం

మీడియా రంగంపై ‘ఏఐ’ ప్రభావం

Gaddamidi Naveen
20 మే, 2026

నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కాలానుగుణంగా ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో నిర్వహించిన జర్నలిస్టుల చర్చా కార్యక్రమంలో మీడియా రంగ భవిష్యత్ దిశ, డిజిటలైజేషన్, మీడియా చట్టాలు, జర్నలిస్టుల శిక్షణ, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో అకాడమీకి అనుబంధ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కమిషనర్, సమాచార & పౌర సంబంధాల శాఖకు చెందిన జి. ముకుంద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశలో పత్రికల ఎడిటోరియల్స్ చదవడం ద్వారా సివిల్ సర్వీసులపై ఆసక్తి పెరిగిందని, అదే తన విజయానికి పునాది అయిందని తెలిపారు. జర్నలిజం సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన వృత్తి అని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్ రావు మీడియా అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ మరిన్ని పుస్తకాలను అకాడమీకి అందజేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మాట్లాడుతూ జర్నలిజం తనకు ధైర్యం, గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్నారు. ఉదుముల సుధాకర్ రెడ్డి ఆధునిక జర్నలిజానికి అనుగుణంగా డిజిటల్ క్లాసులు, ఇంక్యూబేటర్ ఏర్పాటు చేయాలని సూచించగా, దేవులపల్లి అమర్ వెటరన్ జర్నలిస్టుల అనుభవాలను వీడియోలు, పుస్తకాల రూపంలో భద్రపరచాలని అభిప్రాయపడ్డారు.

ఏఐ ప్రభావం – శిక్షణా కార్యక్రమాలు

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సభ్యులు మీడియా రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం పెరుగుతోందని, జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు ఆధునిక శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్‌లు, డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించాలని సూచించారు. అలాగే మహిళా జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంత మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

అకాడమీ భవనంలోని ఆధునిక ఆడిటోరియం, డిజిటల్ సదుపాయాలు, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్ వంటి వసతులను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అభిప్రాయపడ్డారు. పాత పత్రికలు, అరుదైన పుస్తకాలు, నిజాం కాలం నాటి ప్రచురణలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మీడియా చట్టాలలో కాలానుగుణ మార్పులు తీసుకురావడంతో పాటు సోషల్ మీడియాకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి అవసరమని పలువురు పేర్కొన్నారు.

సమాజానికి అద్దం పట్టే వృత్తిగా జర్నలిజం నిలుస్తుందని, నిజాయితీతో వార్తలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని వక్తలు స్పష్టం చేశారు. కార్యక్రమం ముగింపులో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు సంయుక్తంగా సీనియర్ జర్నలిస్టులను శాలువాలతో సత్కరించారు.