Let's talk: editor@tmv.in
ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
25 మే, 2026

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైందని తెలిపారు. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. అలాగే 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వరి, జొన్న, మొక్కజొన్న రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే రైస్‌మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని మంత్రి సూచించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్య పెంచి ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. గతంలో రైతులు చెల్లింపుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే నగదు చెల్లింపులు చేస్తోందన్నారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.