
మహిళల చేతుల్లో పరిశ్రమలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా.. స్వయం శక్తితో నడిపే పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వారి వ్యాపార కలలను సాకారం చేసేలా ఒక సరికొత్త బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార పరమైన సహకారం అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. మహిళలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మిగిలిపోకుండా, సొంతంగా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలన్నారు. ఈ రోజు మనం ప్రారంభిస్తున్న ఈ ఇంక్యుబేటర్ కేంద్రాలు ఒక సాధారణ కార్యక్రమం కాదు.. ఇది తెలంగాణ గ్రామీణ మహిళల భవిష్యత్తును సరికొత్తగా మార్చే ఒక గొప్ప ఆర్థిక ఉద్యమం అని అభివర్ణించారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు దేశంలోనే అగ్రశ్రేణి ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన టీ-హబ్, బీఐటీఎస్ పిలానీ భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 10.70 కోట్ల చొప్పున నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ, పట్టణ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక బిజినెస్ ట్రైనింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ మెళకువలు, డిజిటల్ సపోర్ట్, ఫైనాన్షియల్ గైడెన్స్‌తో పాటు నిపుణులతో బిజినెస్ మెంటారింగ్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టీ-హబ్ సీఈఓ కవికృత్, వి-హబ్ సీఈఓ సీత పల్లచోల, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పలువురు యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
