
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌ను కలిసింది. మాసబ్ ట్యాంక్ లోని మండలి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు, పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ నేపథ్యంలో ప్రభుత్వం సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల సమస్య మరింత క్లిష్టమైందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపులో ఆలస్యం జరగడంతో ప్రైవేట్ కళాశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇది విద్యార్థులపై ఆర్థిక భారం పెంచుతుందని, ముఖ్యంగా ఉన్నత విద్య కొనసాగించేందుకు సర్టిఫికేట్లు అవసరం కావడంతో చాలామంది అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని, బకాయిలను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.
