

పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందని వైయస్‌ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగుపురం గ్రామానికి చెందిన వైయస్‌ఆర్సీపీ నాయకుడు రావాడ ఇల్లయ్య కుటుంబ సభ్యులను తప్పుడు కేసులో జిల్లా జైలుకు పంపగా.. నిన్న ములాఖాత్‌లో ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తదితరులు వారిని పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పోలీసులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వారి వృత్తిపరమైన స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. చిన్న ఆస్తి వివాదాన్ని అడ్డం పెట్టుకుని రావాడ ఇల్లయ్య కుటుంబంలోని ముగ్గురిపై అన్యాయంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు సైతం రాజ్యాంగబద్ధ బాధ్యతలను పక్కనపెట్టి అధికార పార్టీ నేతల ఆదేశాలకు లొంగిపోవడం బాధాకరమన్నారు. గత 80 ఏళ్ల చరిత్రలో పోలీసు వ్యవస్థ ఇంతగా వైఫల్యం చెందడం తామెప్పుడూ చూడలేదన్నారు.
ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సోషల్ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, పోలీస్ స్టేషన్లలోనే చట్టవ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కానీ, పోలీసు పెత్తనంతో ప్రజలను శాశ్వతంగా అణచివేయడం సాధ్యం కాదని, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఇటీవల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై..రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రజలను వేధిస్తున్న అధికారుల వివరాలను నమోదు చేయాలని నిర్ణయించాం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నిరంతర నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, భవిష్యత్తులో మా ప్రభుత్వం రాగానే చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ఈ అధికారులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వాలు శాశ్వతం కాదని, చట్టాలు మాత్రమే శాశ్వతమని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్‌లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. వైయస్‌ఆర్సీపీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుందని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన తీర్పు ఇస్తారని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.
