
రైతు డిస్కమ్ పేరుతో రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది: కవిత
తెలంగాణలో రైతు డిస్కమ్ (రైతులకు ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థ) ప్రతిపాదనపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు రైతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేలా ఉందని ఆమె హెచ్చరించారు.
ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ, రైతు డిస్కమ్ పేరుతో ప్రభుత్వం రైతులపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన వ్యవసాయ రంగానికి హానికరమని, దీన్ని అమలు చేస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. నిజంగా ఇది మంచి నిర్ణయమైతే ప్రభుత్వం దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచిందని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చకు తీసుకురాకపోవడంపై కూడా ఆమె అభ్యంతరం తెలిపారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో దీనిపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇప్పటికే ఉన్న డిస్కమ్‌లు భారీ బకాయిలు, నష్టాల్లో ఉన్నాయని, కొత్త కంపెనీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించలేమని ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్‌కు, ఉచిత విద్యుత్ పథకాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొత్త డిస్కమ్ వలన బకాయిల భారం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని 29 లక్షల బోర్ల మోటార్ల పరిస్థితి డోలాయనంలో పడుతుందన్నారు. ఇది వ్యవసాయ రంగానికి ‘ఎండ్రీన్’ పోసినట్టేనని, ఈ విషయంలో ప్రభుత్వం 1999 నాటి కరెంట్ కాల్పుల ఘటనను కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.
డిస్కమ్‌లు రూ. 69,000 కోట్ల నష్టాల్లో ఉంటే, అందులో ప్రభుత్వమే రూ. 54,000 కోట్ల బకాయిలు పెట్టాలని కవిత వెల్లడించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే డిస్కమ్‌లకు మంచి రేటింగ్ వస్తుందన్నారు. కొత్త డిస్కమ్‌కు 42 శాతం లోడ్ బదిలీ చేస్తూ, 45,000 మంది సిబ్బందిలో కేవలం 2,000 మందిని మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ వస్తే రెండు నెలల సమయం పడుతుందని, మండలానికి ఒక ఉద్యోగి కూడా ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర నిబంధనలకు తలొగ్గి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
విద్యుత్ విభజన చట్టాలను పక్కన పెట్టి ఏపీ ఉద్యోగులను ఫోర్స్‌ఫుల్‌గా ఇక్కడకు తెచ్చారని, జెన్‌కో, రెడ్‌కో, సదరన్ డిస్కమ్‌లలో ఆంధ్రా వాళ్ల పెత్తనం సాగుతోందని కవిత విమర్శించారు. కొత్త రైతు డిస్కమ్‌లో కేవలం తెలంగాణ వాళ్లే ఉండేలా చూడాలని, ఒకవేళ దీనికి లైసెన్స్ ఇస్తే తాము ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వ మోసాలను ఎండగడతామని కవిత హెచ్చరించారు.
