
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: డయల్ యువర్ ఎమ్మెల్యేలో మంత్రి పార్థసారథి
నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడ రూరల్ తాడిగడపలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన మంత్రి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.
దాదాపు గంటన్నరపాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మంచినీటి సమస్యలు, పెన్షన్లు, భూముల వివాదాలు, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను మంత్రి ఓర్పుగా విని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
నూజివీడు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిధులు విడుదలయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పంట రక్షణ కోసం కవర్ల పంపిణీ, బీమా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఆధిపత్య రాజకీయాలు, అరాచకాలు, విధ్వంసక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు.
గృహ నిర్మాణ రంగంలో ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 4.51 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 4 లక్షల పీఎంఏవై (అర్బన్) ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కొత్తగా వచ్చిన దాదాపు 10 లక్షల దరఖాస్తుల్లో 8 నుంచి 9 లక్షల మంది అర్హులను గుర్తించామని, వారికి కూడా త్వరలో ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. గతంలో కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పార్థసారథి తెలిపారు.
