Let's talk: editor@tmv.in
తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి సత్య కుమార్ యాదవ్

తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి సత్య కుమార్ యాదవ్

Panthagani Anusha
28 మే, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సామాన్యుడికి తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మెడ్ టెక్ ఛాలెంజ్ విధానంలో ఏఐ సాంకేతికతను అమలు చేస్తూ ఏపీ “లైట్ హౌస్ స్టేట్”గా జాతీయ గుర్తింపు పొందిందని వెల్లడించారు. మంగళగిరిలో నిర్వహించిన “ఆరోగ్య వ్యవస్థ – ఏఐ ఆధారిత సేవలు” సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఏఐ ఆధారిత పరీక్షల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వేగంగా అందుతాయని దీనివల్ల వైద్యులు సకాలంలో చికిత్స అందించి రోగుల ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి తెలిపారు. పరీక్షల ఖర్చులు తగ్గడం వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులతో సహా 10 రకాల ప్రధాన వ్యాధుల ప్రభావాన్ని ఏఐ ద్వారా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదూర విజన్‌తో నూతన సాంకేతికతను ప్రవేశపెడుతున్నారని ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే “వికసిత్ ఆంధ్రప్రదేశ్” సాకారమవుతుందని స్పష్టం చేశారు.

మెడ్ టెక్ ఛాలెంజ్ కింద 18 అంకుర సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరికరాలతో విజయవంతంగా సేవలందించాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు 20 శాతం పెరిగాయని ఐపీ సేవలు కూడా మెరుగయ్యాయని చెప్పారు. అదేవిధంగా 'అభా' ఖాతాల నమోదులో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.

ఈ పైలట్ ప్రాజెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్‌లకు మంత్రి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ‘క్యాథ్’ కమిటీ పరిశీలన అనంతరం—ఏఐ పవర్డ్ డయాగ్నస్టిక్స్‌లో సొలిసిట్ టెక్నాలజీస్, పోర్టబుల్ డివైసెస్‌లో రెమిడియో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, స్మార్ట్ మానిటరింగ్‌లో కేర్ ఎన్ ఎక్స్ ఇన్నోవేషన్స్, రిమోట్ మానిటరింగ్‌లో రీజువిన్ మెడికేర్ ఇండియా సంస్థలు విజేతలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్వస్తి సంస్థ వ్యవస్థాపకులు శివ్ కుమార్, నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.