

ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్‌సైజ్‌లలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద చేపట్టిన భారీ వరద మాక్ డ్రిల్‌ను మంత్రి ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన తర్వాత తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, ఆ సమయంలో తీసుకునే తక్షణ చర్యలే ప్రాణాలను కాపాడగలవని తెలిపారు. వరదలు, అగ్నిప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం, సహాయక చర్యలను వేగంగా ప్రారంభించడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
1908లో సంభవించిన హైదరాబాద్ మహావరదలు, ఇటీవలి గోదావరి–కృష్ణా వరదలను ప్రస్తావిస్తూ, అప్రమత్తత లేకపోతే విపత్తులు ఎంతటి నష్టం కలిగిస్తాయో చరిత్ర చెబుతోందన్నారు. ప్రజల రక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు, శిక్షణ పొందిన ప్రత్యేక బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. అడవుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
మాక్ డ్రిల్‌లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే ఆధునిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్‌ను సందర్శించి రక్షణ చర్యలను పరిశీలించారు.
రాష్ట్రంలో ఇంత విస్తృత స్థాయిలో మాక్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా అధికారులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఇవన్నీ ముందస్తు సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్‌లేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
