Let's talk: editor@tmv.in
మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క

మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క

Gaddamidi Naveen
27 మే, 2026

గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం నగరానికి వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో నూతనంగా నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ “సఖి కేంద్రం”లను మంగళవారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళలకు సురక్షిత వాతావరణంలో వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. “సఖి నివాస్‌”లో సుమారు 150 మంది మహిళలకు వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. చిన్నపిల్లలతో వచ్చే మహిళలు కూడా ఇక్కడే నివసించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహిళల అభ్యున్నతిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తుండటాన్ని కొందరు సహించలేక విమర్శలు చేస్తున్నారని, కానీ మహిళా శక్తి ముందు అలాంటి విమర్శలు నిలవవని వ్యాఖ్యానించారు. మహిళల పురోగతిని అడ్డుకునే వారికి మహిళలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

మహిళా సంఘాలకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంకులు, మహిళా సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను బుధవారం మధిర నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే జూన్‌ 5న మహిళలకు ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేస్తారని ఆమె తెలిపారు. మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతికి పునాది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, చైల్డ్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, చైల్డ్స్ రైట్స్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.