

గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను, అవకాశాలను అందుపుచ్చుకునేలా ఒక సరికొత్త రంగాన్ని సిద్ధం చేస్తూ, తెలంగాణను అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసిసి నోవోటెల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర దీర్ఘకాలిక దార్శనిక పత్రం ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలను సాధించడంలో లాజిస్టిక్స్ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ఎగుమతుల వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. దేశంలోనే ఎగుమతుల సన్నద్ధత సూచికలో రాష్ట్రం 8వ స్థానంలోనూ, సముద్ర తీరం లేని రాష్ట్రాల జాబితాలో 2వ స్థానంలోనూ నిలిచిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే వాణిజ్య ఎగుమతుల్లో జాతీయ స్థాయిలో 7వ స్థానాన్ని దక్కించుకోవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు. సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక లోపంగా కాకుండా, వ్యూహాత్మక అవకాశంగా మలుచుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు.
లాజిస్టిక్స్ పాలసీ 2.0
రాబోయే సరికొత్త ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ కింద రాష్ట్రంలో మెగా మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌హౌసింగ్ వసతులు, సమగ్ర లాజిస్టిక్స్ హబ్‌ల స్థాపనను ప్రోత్సహించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేస్తున్నామన్నారు. రవాణా రంగంలో సామర్థ్యం, పోటీతత్వాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మల్టీమోడల్ లాజిస్టిక్స్, రైల్వే అనుసంధాన మౌలిక సదుపాయాలు, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌లు, గ్రేడ్-ఏ వేర్‌హౌసింగ్, డిజిటల్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్‌లు, గ్రీన్ మొబిలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్. రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
