Let's talk: editor@tmv.in
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
10 జూన్, 2026

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రానున్న రోజుల్లో అద్దె ప్రాతిపదికన మరో 3 వేల బస్సులను టీజీఆర్టీసీకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మహిళా శక్తి పథకం’ కింద మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను ఆర్టీసీకి అప్పగించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సభలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3,000 బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించనున్నట్లు ప్రకటించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసినా వాటిని ఆర్టీసీకి అనుసంధానం చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, త్వరలో ఈ సంఖ్యను కోటి మందికి పెంచే లక్ష్యం ఉందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. 2034 నాటికి మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే మహిళల నిర్వహణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను “అమ్మ ఆదర్శ పాఠశాల” పేరుతో అప్పగించినట్లు వివరించారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, స్త్రీ శక్తి భవనాలు వంటి అనేక రంగాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్త్రీ శక్తి భవనాలను ప్రారంభించామని, జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

స్వయం సహాయక సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంతో పాటు, రూ.2 వేల కోట్ల వడ్డీ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని సీఎం వెల్లడించారు. అలాగే మహిళా సంఘాలకు వివిధ పథకాల కింద చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సుల అద్దె రూపంలో రూ.20.34 కోట్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం కింద ఆదా చేసిన నిధులు, వడ్డీ రహిత రుణాల కోసం రూ.500 కోట్ల చెక్కులు అందజేశారు. రైతులు పంట మార్పిడి చేయాలని, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.