
గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గల్లా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి వారం ఒక్కో డివిజన్‌లో మెగా వైద్య శిబిరాలను ఉద్యమంలా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18వ డివిజన్‌లో శ్రీ భ్రమర ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ అధినేత గల్లా రామచంద్ర రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈ ఏడాది “ఉద్యోగ కల్పన – ఆరోగ్యం” అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 70 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. వికాస్ హాస్పిటల్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జరిగిన శిబిరాల్లో ఉచిత వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు, మందుల పంపిణీ ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ఆదివారం నిర్వహించిన శిబిరంలోనే 400 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇక ఈసీజీ పరీక్షల్లో కొందరికి గుండె సంబంధిత సమస్యలు గుర్తించడంతో వారిని తక్షణమే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే ఉచిత మందులు అందించామని వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న కొందరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
శిబిరానికి వచ్చిన కొంతమంది ఒంటరి మహిళలు గుండె సంబంధిత సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు, అవసరమైతే ఎల్‌ఓసీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందించి తక్షణ చికిత్స కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అవసరమైన వారికి పూర్తి సహకారం అందించేందుకు వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యం కూడా ముందుకు వచ్చిందని ఆమె తెలిపారు. ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను అభినందించారు.
