

ఏపీని ఏఐ, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం అక్కడ నిర్వహించిన స్టార్టప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌కు చెందిన వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ ఇన్వెస్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, ఆవిష్కరణల మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను ఆయన విస్తృతంగా వివరించారు.
ఈ ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పాక్ అంబులే, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పలువురు ప్రముఖ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు పాల్గొన్నారు.
సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులను స్థాపించడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' ద్వారా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని, వైద్య సాంకేతిక ఉత్పత్తులతో పాటు అధునాతన పరికరాల తయారీలో అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు. దేశం నుంచి ప్రపంచ మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతున్నాయన్నారు. ఐదో తరం యుద్ధ విమానాల వంటి అత్యాధునిక ఉత్పత్తులను భారత్ తయారు చేస్తోందని, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న యువ శ్రామిక శక్తి దేశానికి లభించిన అతిపెద్ద వరమని కొనియాడారు.
దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి అందుబాటులో ఉందని, ఈ జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధానం ద్వారా ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
భూసేకరణకు వేగవంతమైన అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల కోసం భూసమీకరణ ద్వారా భూమిని సమకూరుస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలకు తమ ప్రభుత్వం అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేసి, భూములను కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 'శ్రీ సిటీ' వంటి పారిశ్రామిక మండలాలు ఇప్పటికే భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.
మాకు రోబోటిక్స్, వైద్య పరికరాలు, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలలో సింగపూర్ సహకారం కావాలి. సింగపూర్ టెక్నాలజీ రంగానికి అవసరమైన మానవ వనరుల అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ యువత పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ ఒక ముఖ్య భాగస్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హైకమిషనర్ శిల్పాక్ అంబులే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్ వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి ఉన్న అవకాశాలను చర్చించారు. సింగపూర్ గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం), సెమీకండక్టర్ రంగా ఆవిష్కరణలలో చాలా ముందుందని, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉందని తెలిపారు. దేశంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు.
యూఎన్-హాబిటాట్ తో భాగస్వామ్యం
పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు యూఎన్-హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రాస్‌బాచ్ తో సమావేశమయ్యారు. 2028 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ఒక అవగాహన ఒప్పందం ద్వారా కాలపరిమితిని నిర్దేశించుకోవాలని సీఎం ప్రతిపాదించగా, వారు సానుకూలంగా స్పందించారు. వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత నగరాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్‌లో 'రైజ్ అప్' కార్యక్రమాన్ని అమలు చేయాలని, పట్టణ మురికివాడల అభివృద్ధి కోసం 'పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రామ్' పై చర్చించారు. అలాగే, వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరహా నగరాల్లో ఉమ్మడిగా 'అర్బన్ రాస్తా' ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఏపీని దేశంలోనే అతిపెద్ద ఏఐ హబ్‌గా మార్చేలా గూగుల్ క్లౌడ్‌తో చర్చలు
అనంతరం గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు అతిపెద్ద హబ్‌గా మార్చడంపై చర్చించారు.
గూగుల్ క్లౌడ్ సహకారంతో ఏఐ స్కిల్లింగ్ , క్లౌడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని, ప్రభుత్వ సేవల్లో ఏఐని ఉపయోగించుకునేందుకు గూగుల్ క్లౌడ్ మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్‌లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఒక ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. అలాగే రాష్ట్ర సజీవని ప్రాజెక్టులో గూగుల్ క్లౌడ్ భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు.
వైసీహెచ్ లాజిస్టిక్స్ తో చర్చలు
సప్లై చైన్ అభివృద్ధి, లాజిస్టిక్స్ పార్కులు, అత్యాధునిక ఆటోమేటెడ్ టెక్నాలజీతో కూడిన భారీ 'సప్లై చైన్ సిటీ' నిర్మాణంలో భాగస్వామ్యంపై వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ఆపరేషన్స్ హెడ్ సునీల్ నంబియార్ తో సీఎం చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, జాతీయ రహదారుల అనుసంధానత, ఓడరేవులు, విమానాశ్రయాలు రైల్వే నెట్‌వర్క్ వల్ల రవాణా ఖర్చులు ఎంతో తగ్గుతాయని సీఎం వివరించారు. రాష్ట్రంలో హార్టికల్చర్ రంగంలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రూపొందించామని, ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఆహార ఉత్పత్తుల విలువ జోడింపు ద్వారా ఎగుమతులను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇన్వెస్టర్లు ఏపీని సందర్శించి పాలసీలను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
