Let's talk: editor@tmv.in
ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: పవన్ కళ్యాణ్

ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: పవన్ కళ్యాణ్

Panthagani Anusha
31 మే, 2026

పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన రంగానికి ప్రత్యామ్నాయంగా నిలిచే ‘చెత్త నుంచి విద్యుత్ తయారీ’ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరించి పునరుత్పాదక ఇంధనంగా మలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కొండవీడులోని ‘జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంటును సందర్శించిన ఆయన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదన జరిగే పూర్తి ప్రక్రియను, చెత్తను వేరు చేసే విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా బాయిలర్లలో చెత్తను మండించడం ద్వారా విద్యుత్ తయారు చేయడం ఆ ప్రక్రియలో చివరకు మిగిలే బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు ఆయనకు క్షుణ్నంగా వివరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ ఎం.వి.చారి రాష్ట్రంలో చెత్త సేకరణకు ఉన్న అవకాశాలపై ఒక ప్రత్యేక నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించగా దానిపై సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా మరో 6 విద్యుత్ ప్లాంట్లు

రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం కొండవీడు జిందాల్ ప్లాంట్ నిత్యం 1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేస్తూ 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్ర గ్రిడ్‌కు అందిస్తోందని, అలాగే విశాఖపట్నంలోని ప్లాంట్ ఉత్తరాంధ్ర రీజియన్ వ్యర్థాలతో 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పాదన చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు రహితంగా మార్చేందుకు ప్రతి 100 కిలోమీటర్లకు ఒక వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కాకినాడలో పనులు ప్రారంభం కాగా నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాలలో త్వరలోనే మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని దీనికి సగటున 2.5 టన్నుల చెత్త, 4.5 టన్నుల స్టీమ్ అవసరమవుతాయని వివరిస్తూ.. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాలు

రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గోదావరి నదిలో కలుస్తున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిందాల్ సంస్థ అనుసరిస్తున్న పక్కా వ్యూహాలను అమలు చేస్తామన్నారు. పుష్కరాలతో ప్రత్యక్షంగా భాగస్వామ్యమయ్యే 268 గ్రామ పంచాయతీల్లో చెత్త నిర్వహణ అత్యంత కీలకం కానుందని, నదిలోకి వ్యర్థాలు చేరకుండా నదీ తీరాలను అందంగా తీర్చిదిద్దడంపై పంచాయతీ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా పూలు, పండ్లు, కూరగాయలు, ఆహార వ్యర్థాల వంటి తడి చెత్తను బయో మిథలైజేషన్ ప్లాంట్ల ద్వారా బయో గ్యాస్‌గా మార్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ మోడల్స్ స్ఫూర్తితో మార్పులు

వ్యర్థాల నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలు, దేశీయంగా ఉత్తమ నగరాల విధానాలను ఏపీలో అమలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సింగపూర్‌లో మొత్తం విద్యుత్ వినియోగంలో 2.8 శాతం చెత్త ద్వారానే ఉత్పత్తి అవుతోందని, అక్కడ దాదాపు 90 శాతం చెత్తను కాల్చి ఇంధనంగా మారుస్తూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని కొనియాడారు. సింగపూర్ టాంజాంగ్ టెర్మినల్ తరహాలోనే విశాఖపట్నం పోర్టులో కూడా పద్ధతి ప్రకారం చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. దేశీయంగా వరుసగా ‘స్వచ్ఛభారత్’ అవార్డులను గెలుచుకుంటూ ఆదర్శంగా నిలిచిన మధ్యప్రదేశ్ లోని ‘ఇండోర్’ నగరపాలక సంస్థ చెత్త సేకరణ విధానాన్ని రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.

గ్రామాల్లో క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు

చెత్త సేకరణ, వ్యర్థాల విభజన అనే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. చెత్త ద్వారా పంచాయతీలు ఆదాయాన్ని ఎలా ఆర్జించవచ్చో వివరించేందుకు డంపింగ్ యార్డులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల వారీగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే ప్రక్రియలో సమూల మార్పులు తీసుకువచ్చి, ఏపీని దేశంలోనే పర్యావరణహిత రాష్ట్రంగా నిలబెడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.