
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. నేడు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ భాగస్వామ్యాలను సమీక్షించడానికి ఈ పర్యటన ఉద్దేశించబడింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి జూన్ 14న (ఆదివారం) ఉదయం 11:35 గంటలకు బెంగళూరు నుంచి సింగపూర్‌కు బయలుదేరుతారు. జూన్ 15, 16 తేదీల్లో అక్కడ పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
ప్రముఖ సంస్థల సీఈఓలు, మంత్రులతో భేటీ
సింగపూర్లో జూన్ 15న ఉదయం 10:30 గంటలకు సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, యూఎన్-హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్‌బాచ్‌తో మధ్యాహ్న భోజన విరామ సమయంలో చర్చిస్తారు. ఆ తర్వాత సింగపూర్ సీనియర్ రాష్ట్ర మంత్రి లో యెన్ లింగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గువాన్, వైసీహెచ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చైలతో విడివిడిగా సమావేశమై ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు.
అత్యంత కీలకమైన ఘట్టంలో.. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయి, రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారంపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం శాఖ మంత్రి కె. షణ్ముగం, మానవశక్తి శాఖ మంత్రి టాన్ సీ లెంగ్‌లతో కూడా ఆయన సమావేశమవుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో ముఖాముఖి నిర్వహిస్తారు.
జూన్ 16న కాకతీయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ‘సీబీఎన్@361’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఏపాక్ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సుర్బానా జురాంగ్-అమరావతి ప్లానింగ్ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ ఉప ప్రధాన మంత్రి, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి గన్ కిమ్ యాంగ్ నేతృత్వంలోని బృందంతో చంద్రబాబు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో లీడర్‌షిప్ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి ఎగ్జిబిషన్‌ను సందర్శించి సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్స్ అల్లే, గూగుల్ టెక్నాలజీస్ స్టాళ్లను వీక్షిస్తారు.
చివరగా ‘సీట్రియం’ ప్రతినిధులతో సమావేశమై, ఏపీ పెట్టుబడుల విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్‌షో’లో పాల్గొంటారు. సింగపూర్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ, అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. పర్యటన ముగించుకుని జూన్ 16న రాత్రి భారత్‌కు తిరిగి రానున్నారు.
