
ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యం.. వలసలు కాదు, వలసలు వచ్చే ప్రాంతంగా తీర్చిదిద్దుతాం:ఏపీ సీఎం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఈ ప్రాంతం నుండి ప్రజలు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఉండదని ఇతర ప్రాంతాల నుంచే ఇక్కడికి వలసలు వచ్చేలా భారీగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని తామ్రపల్లిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ ప్రజావేదిక సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రగతి కుంటుపడిందని విమర్శించిన ఆయన, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.
జనాభా పెంపుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపై కుటుంబంలో మూడో సంతానం పుడితే రూ. 30 వేలు, నాలుగో సంతానం పుడితే రూ. 40 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. పిల్లలు భారం కాదని దేశ భవిష్యత్తుకు వారే ఆస్తి అని పేర్కొన్నారు. జనాభా తగ్గితే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అందుకే సమాజం అంతా జనాభా పెంపుపై సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. ఇప్పటికే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15 వేల సాయం అందిస్తున్నామని, అంగన్‌వాడీలను కూడా బలోపేతం చేస్తున్నామని గుర్తుచేశారు.
స్వచ్ఛాంధ్ర కోసం భారీ కార్యాచరణ
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ‘స్వచ్ఛపథం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గత 23 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 121 లక్షల టన్నుల చెత్తను తొలగించామని రాబోయే జూన్ నాటికి పాత చెత్త (లెగసీ వేస్ట్) మొత్తాన్ని పూర్తిగా క్లీన్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీగా పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్తను నేరుగా ఇళ్ల నుంచే సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. చెత్తను సమర్థవంతంగా రీసైకిల్ చేయడానికి రూ.1,254 కోట్లతో ఆరు ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులు ఆరు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిదంగా రూ. 603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు నిర్మిస్తున్నామని ఇవి అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తే డంపింగ్ యార్డుల అవసరమే ఉండదన్నారు. ఈ నెలాఖరులోగా మున్సిపాలిటీలకు 5,000 పుష్ కార్టులు, 12,000 ట్రైసైకిళ్లు ఇస్తామని రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను ప్రస్తుతమున్న 31.33 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచుతామని వివరించారు.
‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతను మరింత మెరుగుపరచడానికి ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ అనే సరికొత్త కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నెలరోజుల పాటు సాగే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా పాల్గొంటారన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా ‘మ్యాజిక్ డ్రైన్లు’ నిర్మిస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర పంచాయతీలు అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు.
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులు.. వేలాది ఉద్యోగాలు
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఐటీ కంపెనీలు రాబోతున్నాయని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని వీటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని తెలిపారు. రిలయన్స్ సంస్థ రూ.1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రాగా టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్, రెన్యూపవర్ వంటి దిగ్గజ సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రాబోయే జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని అదేవిదంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే మూలపేట పోర్టును కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపు
ఇక రైతాంగానికి మేలు చేసేలా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ‘ఇరిగేషన్ క్యాలెండర్’ రూపొందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మద్దువలస స్టేజ్-2, హిరమండలం ఎత్తిపోతల, వంశధార ఫేజ్-2, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీలు, జంఝావతి ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన ‘నేరడి బ్యారేజ్’ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించాయని ఈ ఏడాది నవంబర్‌లో శంకుస్థాపన చేసి మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రధాని మోడీ సూచనలు పాటిద్దాం
ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాటించాలని సీఎం కోరారు. ట్రాఫిక్, కాలుష్యం తగ్గడానికి వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) చేయడం, ఆర్టీసీ వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడడం మరియు ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటివి చేయాలన్నారు.
కాగా ఈ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో చాలా సాదాసీదాగా ప్రయాణించడం ప్రజలను ఆకట్టుకుంది. సభ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులు తయారు చేసిన ‘సవర ఆర్ట్’ ఓవర్ కోటును సీఎం స్వయంగా ధరించి, వారి ప్రతిభను ఎంతగానో అభినందించారు.
