


పేదరికం లేని సమాజమే లక్ష్యం..చామవరం సభలో చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన "పేదల సేవలో" బహిరంగ సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై విస్తృతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా ఆ తేదీ నిలిచిపోతుందని అన్నారు. ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా నవ్వడానికి కూడా భయపడే పరిస్థితులు ఉండేవని విమర్శించారు. గతంలో ప్రజలు సభల నుంచి వెళ్ళిపోకుండా కందకాలు తవ్వి, ఫెన్సింగ్‌లు వేసే దుస్థితి ఉండేదని, కానీ నేడు తమ ప్రభుత్వం ప్రజల వద్దకే స్వయంగా వెళ్తోందని అన్నారు.
ప్రస్తుతం, రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా తొలి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను భారీగా పెంచామన్నారు. వృద్ధాప్య పెన్షన్లను రూ.3,000 నుండి ఒకేసారి రూ.4,000కు, దివ్యాంగుల పెన్షన్లను రూ.6,000కు పెంచడమే కాకుండా, తీవ్ర అనారోగ్య బాధితులకు రూ.15,000 వరకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. 2024 జూలై నుండి ఇప్పటివరకు రూ.65,887 కోట్లను పెన్షన్ల కోసమే ఖర్చు చేశామని, కేవలం ఈ పథకానికే ఏడాదికి రూ.32 వేల కోట్లు కేటాయిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల విస్తరణ
గత ప్రభుత్వంలా కేవలం డిజిటల్ బటన్ నొక్కి పైశాచిక ఆనందం పొందడం కాకుండా, ప్రతి నెల ఒకటో తేదీన అధికారులే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని సీఎం తెలిపారు. ఈ నెలలో 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్లు పంపిణీ చేస్తున్నామని, ఏదైనా కారణంతో పెన్షన్ తీసుకోలేకపోతే మూడు నెలల మొత్తాన్ని కలిపి ఇచ్చే వెసులుబాటు కల్పించామని చెప్పారు. కొత్తగా 5,606 మందికి రూ.2.24 కోట్ల విలువైన స్పౌజ్ (భార్యాభర్తల) పెన్షన్లను మంజూరు చేశామన్నారు.
అలాగే, రాష్ట్రంలోని అనేక పేద కుటుంబాలకు ఒకేసారి రెండు నుంచి నాలుగు వరకు సంక్షేమ పథకాల లబ్ధి అందుతోందని సీఎం తెలిపారు. ‘తల్లికి వందనం’, ‘స్త్రీశక్తి’, ‘అన్నదాత సుఖీభవ’, ‘ఆటోడ్రైవర్ సేవలో’, ‘మత్స్యకారుల సేవలో’ వంటి పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు.
దివ్యాంగులకు ‘దివ్యాంగశక్తి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యజమానులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకాలన్నీ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికేనని వివరించారు.
23 లక్షల ఉద్యోగాల లక్ష్యం
రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత 23 నెలల కాలంలోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా మన యువతకు 23 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగా కాకినాడ సమీపంలో రూ.80 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, తుని పక్కనే అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 'పీఎం సేతు' కింద ఏడాదికి 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) శిక్షణ ఇస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణతో పాటు విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైందని వివరించారు.
సమర్థవంతమైన నీటి నిర్వహణ
రాష్ట్రాన్ని మూడు ప్రధాన రీజియన్లుగా విభజించి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం నుండి ఉమ్మడి తూర్పుగోదావరి వరకు 'విశాఖ రీజియన్' గా, పశ్చిమగోదావరి నుండి ప్రకాశం వరకు 'అమరావతి రీజియన్' గా, తిరుపతి కేంద్రంగా 'రాయలసీమ రీజియన్' గా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ కొరత, ఇంధన ధరల పెరుగుదల, ఎగుమతుల నిలిపివేత వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎండలు ముదిరి, వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వ సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ముందస్తుగానే కాలువలకు సాగునీరు విడుదల చేశామని సీఎం తెలిపారు.
పోలవరం, పుష్కరాల ప్రణాళిక
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఈ ఏడాది జూలై నాటికే పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి నీటిని తీసుకెళ్తామని, 2027లో రాబోయే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తీరప్రాంత మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను సబ్సిడీపై అందిస్తామని, అమినాబాద్ ఫిషింగ్ హార్బర్ పనుల కోసం రూ.80 కోట్లు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తీరప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు సీ-వీడ్ (సముద్రపు నాచు) ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం కల్పిస్తామన్నారు. కాకినాడ జిల్లాలో పౌర సేవలను సమర్థవంతంగా అందించిన అధికారులను అభినందిస్తూ, ప్రజాప్రతినిధులు-అధికారులు సమన్వయంతో ప్రజలకు మరింత సేవ చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
