
దోషరహిత ఓటర్ల జాబితాయే లక్ష్యం.. సర్ ప్రక్రియపై ఈసీఐ సమీక్ష
ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు కలిగిన వారి వివరాలను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడమే 'ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
ఈ మేరకు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో సర్ ప్రక్రియకు సంబంధించిన సన్నద్ధత, సమీక్షా సమావేశం అత్యున్నత స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు సర్ ప్రక్రియకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ప్రాథమిక సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం జూన్ 15 నుంచి జులై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపడతారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి, అదే రోజు నుంచి ఆగస్టు 20 వరకు ప్రజల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటన్నింటినీ నిబంధనల ప్రకారం పరిష్కరించి, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు అధికారులు తెలిపారు.
పారదర్శకతకు అగ్రతాంబూలం: కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే
ఈసీఐ కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. "ప్రతి బీఎల్‌వో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలి. సర్వే సమయంలో కొత్త ఓటర్ల నమోదు మార్పులు-చేర్పుల కోసం ఫారం-6, 7, 8 దరఖాస్తులను అందుబాటులో ఉంచాలి. ఓటర్ల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం అయ్యేలా నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
చిన్న పొరపాట్లకు కూడా తావుండొద్దు: కార్యదర్శి నవీన్ కుమార్
మరో కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలను లోపరహితంగా, పారదర్శకంగా రూపొందించడమే ఈ సుదీర్ఘ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పరిమిత కాలవ్యవధిలో ఈ బాధ్యతను పూర్తి చేయాల్సి ఉన్నందున అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా అత్యంత కచ్చితత్వంతో పనులు నిర్వహించాలని హెచ్చరించారు.
