


డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులతో గవర్నర్ ప్రతిజ్ఞ
మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యువతను, విద్యార్థులను ఈ పోరాటంలో భాగస్వాములను చేస్తూ హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విద్యార్థినీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ
"నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అంటూ విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు.
రూ. 50.73 కోట్లతో క్రీడాభివృద్ధి పనులు
రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కల్పనకు గాను రూ. 50.73 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందులో రూ. 36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, రూ. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియాల్లో బాల బాలికల క్రీడా శిక్షణ అకాడమీల ఏర్పాటు ఉన్నాయి.
తెలంగాణను విద్యా, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అద్భుతమైన విద్యా, క్రీడా హబ్‌గా మార్చాలన్నదే తన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ వేదికపై రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కిట్ల పంపిణీతో పాటు విద్యా రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవడానికి వీలుగా అన్ని వస్తువులతో కూడిన 'యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్'ను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27.50 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ విద్యా రంగాన్ని వికాసం వైపు నడిపించేందుకు బడ్జెట్‌లో రూ. 26,600 కోట్లు (8.5 శాతం) నిధులు కేటాయించామని సీఎం తెలిపారు. దీన్ని ప్రభుత్వం ఖర్చుగా కాకుండా, రేపటి తరం భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది వేసే "పెట్టుబడి"గా భావిస్తోందని పేర్కొన్నారు. "దేశ భవిష్యత్తు సంక్షేమ హాస్టళ్లలో, గ్రామీణ ప్రాంతాల తరగతి గదుల్లోనే ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు స్పష్టమైన విద్యా పాలసీ
నిరుపేద తల్లిదండ్రుల ఇంగ్లీష్ చదువుల కలను సాకారం చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించామని సీఎం వివరించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒక స్పష్టమైన విధానం ఉండాలనే లక్ష్యంతోనే నూతన విద్యా పాలసీని తీసుకువచ్చామన్నారు. ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూల్ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వ పాఠశాలల్లో "నో అడ్మిషన్" అని బోర్డులు పెట్టే స్థాయికి ఉపాధ్యాయులు శ్రమించారని కొనియాడారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అందించడంతో పాటు, భవిష్యత్తులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వంద మంది అంబేద్కర్లు రావాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి దిక్సూచిగా నిలిచారు. తెలంగాణలోని దళిత బిడ్డల నుంచి మరో వంద మంది అంబేద్కర్లు రావాలని సీఎం ఆకాంక్షించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, చదువుకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యతను తాను తీసుకుంటానని విద్యార్థులకు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లు అందజేయడంతో పాటు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే, గవర్నర్, సీఎం,మంత్రులు కలిసి “అన్న- అక్క మెంటార్షిప్” కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
శంకుస్థాపనలు చేసిన పనుల..
• కొందుర్గు (షాద్‌నగర్, రంగారెడ్డి): రూ. 10 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
• సంగారెడ్డి: రూ. 10 కోట్లతో డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ.
• నర్వ (నారాయణపేట్): రూ. 4 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
• ఆత్మకూర్ (వనపర్తి): రూ. 4 కోట్లతో మల్టీపర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో కోర్టులు, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి.
• గాంధారి (కామారెడ్డి): రూ. 3.50 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
• నర్సాపూర్ (మెదక్): రూ. 2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
• ఉట్కూరు (మక్తల్, నారాయణపేట్): రూ. 2.50 కోట్లతో వాలీబాల్ & కబడ్డీ కోర్టుల నిర్మాణం.
• గచ్చిబౌలి స్టేడియం: రూ. 5.70 కోట్లతో బాలుర కోసం ఫిఫా-ఏఐఎఫ్‌ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, రూ. 35.95 లక్షలతో బాలికల అథ్లెటిక్స్ అకాడమీ, రూ. 44.50 లక్షలతో బాలికల హాకీ అకాడమీ.
• ఎల్‌బీ స్టేడియం: రూ. 58.50 లక్షలతో బాలుర ఫుట్‌బాల్ అకాడమీ, రూ. 49 లక్షలతో బాలుర హ్యాండ్‌బాల్ అకాడమీలను ప్రారంభించారు.
