
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి
నగరంలోని విద్యార్థి జోన్లలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు మల్కాజిగిరి పోలీసులు తమ నిఘాను ముమ్మరం చేశారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు అత్యాధునిక సాంకేతికతను జోడించి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి శుక్రవారం వెల్లడించారు. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని హాస్టళ్లు, విద్యా సంస్థల సమీపంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన ఆమె, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరోధించడంతో పాటు విద్యాసంస్థలు, హాస్టళ్ల పరిసరాల్లో పనిచేస్తున్న స్థానిక డ్రగ్ నెట్‌వర్క్‌లను పూర్తిగా అణచివేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో విద్యార్థుల కదలికలు, అనుమానాస్పద సమూహాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కడ గుమికూడుతున్నారో గుర్తించి, డ్రగ్స్‌కు సంబంధించిన హాట్‌స్పాట్‌లను గుర్తించే చర్యలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా రాత్రి పహారా బృందాలకు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందజేసి, అనుమానితులపై అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
మల్కాజిగిరి పరిధిలో ఏర్పాటు చేసిన 3,200 సీసీటీవీ కెమెరాల్లో 70 శాతానికి పైగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉండి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై రియల్‌టైమ్ పర్యవేక్షణ అందిస్తున్నాయని కమిషనర్ తెలిపారు. సరూర్‌నగర్ పరిధిలోని హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. హాస్టల్ నిర్వాహకులు హై-రిజల్యూషన్ సీసీటీవీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పులు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం లేదా ఇతర సంఘవ్యతిరేక కార్యకలాపాలకు సహకరిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఒక్క కేసుతో కెరీర్ నాశనం
నిషేధిత పదార్థాల విక్రయంపై అనుమానం ఉన్న పాన్ షాపులను కూడా ప్రత్యేక నిఘాలో ఉంచారు. డ్రగ్స్ సరఫరాలో పాల్గొనేవారిపై ఎన్‌డీపీఎస్ చట్టంతో పాటు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఎన్‌డీపీఎస్ కేసు జీవితాన్నే దెబ్బతీస్తుందని సుమతి హెచ్చరించారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల యువత చదువు, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే ఒక్క కేసు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడానికి, విదేశీ ప్రయాణాలపై పరిమితులకు దారితీయవచ్చని తెలిపారు. చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సెలింగ్, పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
