
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: తెలుగు రాష్ట్రాల సీఎంల పిలుపు
మత్తుపదార్థాల వినియోగం లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలందరూ చేతులు కలపాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు యువత సంక్షేమాన్ని కాంక్షిస్తూ విడివిడిగా కీలక సందేశాలు ఇచ్చారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ – డ్రగ్స్ రహిత భారత్
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సందేశంలో.. మత్తుపదార్థాల వ్యసనం అనేది వ్యక్తిగతంగానే కాకుండా, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ – డ్రగ్స్ రహిత భారత్’ సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మత్తుపదార్థాలు కేవలం వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, సమాజంలో తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల సామాజిక బాధ్యత, అప్రమత్తత ఎంతో కీలకమని స్పష్టం చేశారు. యువతలో సానుకూల ఆలోచనలను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘2కె రన్’ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
డ్రగ్స్ అక్రమ రవాణాపై ‘జీరో టాలరెన్స్’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా మనం చేసే పోరాటం.. అంతిమంగా మన యువత కోసం, వారి కలలు, ఆరోగ్యం వారి భవిష్యత్తు కోసం చేసే పోరాటం" అని ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయడానికి, ఇందుకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో, ఈ వ్యసనం బారిన పడి నలిగిపోతున్న వారికి కోలుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించి, వారు కొత్త జీవితాన్ని నిర్మించుకునేలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గతంలో లాగా "డ్రగ్స్ రాజ్యమేలే" రోజులు ముగిసిపోయాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రవాణాపై పూర్తి ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు సాగుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
