Let's talk: editor@tmv.in
ఏపీలో ‘క్రియేటివ్ ఎకానమీ’ విప్లవానికి శ్రీకారం!

ఏపీలో ‘క్రియేటివ్ ఎకానమీ’ విప్లవానికి శ్రీకారం!

Dantu Vijaya Lakshmi Prasanna
26 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ సినీ, సృజనాత్మక రంగాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చలనచిత్ర రంగానికి ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తూ ‘క్రియేటివ్ ఎకానమీ’ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా సినీ రంగంపై అవగాహన, నైపుణ్యాభివృద్ధి కోసం భారీ స్థాయిలో ‘క్రియేటివ్ ఎకానమీ వర్క్‌షాప్’ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

గురువారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్‌ను ‘జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. సంస్థ ఫౌండర్ దివ్య కొనకళ్ల, కో-ఫౌండర్ పెయ్యాల శశికుమార్ రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ, ఫిల్మ్ మేకింగ్ రంగాల్లో యువతకు శిక్షణ అందించే ప్రతిపాదనను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించి, యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని యువతలో అపారమైన సృజనాత్మక శక్తి ఉందని, వారికి సరైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందితే ప్రపంచ స్థాయి సినీ నిపుణులుగా ఎదగగలరని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా సినిమా నిర్మాణంలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతలు, డిజిటల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్ర నిర్మాణ పద్ధతులను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.

సినిమా నిర్మాణంలో కీలకమైన 24 క్రాఫ్ట్స్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కథా రచన, స్క్రీన్‌ప్లే అభివృద్ధి, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ వంటి విభాగాల్లో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. ముఖ్యంగా ఏఐ సహాయక చిత్ర నిర్మాణం, ఆధునిక ఫిల్మ్ టెక్నాలజీలపై ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించి పాల్గొనేవారికి ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్ యువతలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారికి సరైన వేదిక, మార్గదర్శకత్వం, సాంకేతిక పరిజ్ఞానం అందితే టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ సినీ రంగంలోనూ తమ ముద్ర వేయగలరు. ఈ క్రియేటివ్ ఎకానమీ వర్క్‌షాప్ ద్వారా స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం అందించి, ఆంధ్రప్రదేశ్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

జాడెక్స్ ఇన్నోవిజన్ ఫౌండర్ దివ్య కొనకళ్ల మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని కేవలం తరగతులకే పరిమితం చేయకుండా, ప్రతి పాల్గొనేవారికి ప్రాక్టికల్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలోని ప్రముఖ నిపుణులను ఈ వర్క్‌షాప్‌లో భాగస్వామ్యం చేసి, యువతకు నేరుగా నేర్చుకునే అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ విస్తరణ, ఉపాధి అవకాశాల సృష్టి, స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి వేదిక కల్పించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం సినీ రంగంలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ‘క్రియేటివ్ ఎకానమీ’ అభివృద్ధికి కొత్త దిశ లభించనుంది.

ట్యాగ్‌లు
CreativeEconomyAndhraPradeshAPFilmIndustryKandulaDurgeshFilmWorkshopFilmMakingTollywoodTeluguCinemaAPYouthCreativeTalentAIInCinemaFilmTechnologyDigitalCreatorsScreenwritingCinematographyMovieMakingAndhraPradeshNewsCreativeIndustryFilmTrainingCinemaHubAPJadexInnovisionAPGovernmentChandrababuNaiduPawanKalyanEntertainmentNews