Let's talk: editor@tmv.in
దేశానికి గొప్ప నాగరికత ఉంది: ప్రధాని మోడీ
దేశానికి గొప్ప నాగరికత ఉంది: ప్రధాని మోడీ

దేశానికి గొప్ప నాగరికత ఉంది: ప్రధాని మోడీ

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గొప్ప నాగరికత ఉందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. దానికి ప్రతీకగా ఆదిచుంచనగిరి మఠానికి దాదాపు రెండు వేల ఏళ్ల సంప్రదాయం ఉందని తెలిపారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న శ్రీ ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠ్‌ వద్ద నిర్మించిన శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలగంగాధరనాథ మహాస్వామిజీ సేవలను ప్రశంసిస్తూ, ఆయనను ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవకు మార్గదర్శిగా అభివర్ణించారు. ఈ మఠం తరతరాలుగా సమాజానికి సేవ చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తోందని అన్నారు. బాలగంగాధరనాథ మహాస్వామిజీ సాధారణ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేశారని మోడీ గుర్తుచేశారు. నిజమైన భక్తి అనేది ప్రపంచాన్ని వదిలి వెళ్లడం కాదని, సమాజం కోసం బాధ్యత తీసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాల్లో సేవలు

మహాస్వామిజీ ఆధ్వర్యంలో పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రాథమిక విద్య నుంచి వృత్తిపరమైన విద్య వరకు అందించే అనేక విద్యాసంస్థలు స్థాపించారని ప్రధాని తెలిపారు. అలాగే, మెరుగైన వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే దృష్టితో మఠం చేపట్టిన ఆరోగ్య సేవలను ఆయన ప్రశంసించారు. మెరుగైన వైద్యం కొద్దిమందికి మాత్రమే కాకుండా ప్రతి పౌరుడికి అందాల్సిన హక్కు అని మోడీ అన్నారు.

నెమళ్ల సంరక్షణకు ప్రత్యేక ఉద్యమం

మహాస్వామిజీ జీవరాశుల పట్ల చూపిన కరుణను గుర్తుచేస్తూ, నెమళ్ల సంరక్షణ కోసం ఆయన చేపట్టిన ఉద్యమాన్ని ప్రధాని ప్రశంసించారు. నెమలి భారతదేశ జాతీయ పక్షి మాత్రమే కాకుండా సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగిందని అన్నారు.

ప్రజలకు తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని పిలుపు

ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రజలకు తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. వాటిలో ప్రధానంగా:

• నీటి సంరక్షణ

• ‘ఎక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా చెట్ల నాటడం

• ప్రజా, ఆధ్యాత్మిక స్థలాల్లో పరిశుభ్రత

• ‘వోకల్ ఫర్ లోకల్’ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం

• దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం

• రసాయన రహిత సహజ వ్యవసాయం

• మిల్లెట్లు (రాగి వంటి ధాన్యాలు) ప్రోత్సహిస్తూ ఆరోగ్యకర ఆహారం

• యోగా, ఫిట్‌నెస్‌ అలవాటు

• సమాజ సేవ

ఈ ప్రతిజ్ఞలను నిజాయితీతో అమలు చేస్తే అభివృద్ధి చెందిన కర్ణాటకతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు.

పుస్తకావిష్కరణ, ఆలయ సందర్శన

ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ. దేవెగౌడతో కలిసి ‘సౌందర్యలహరి అండ్‌ శివ మహిమ స్తోత్రం ’ అనే పుస్తకాన్ని ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమానికి ముందు ఆయన జ్వాలా పీఠం, శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు.

ప్రముఖుల హాజరు

కర్ణాటక గవర్నర్ థావర్‌‌చంద్‌ గెహ్లట్‌, ఆదిచుంచనగిరి మఠ ప్రస్తుత పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామి, కేంద్ర మంత్రులు హెచ్‌డీ.కుమారస్వామి, శోభ కరద్లాంజే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాండ్యను ‘శక్కరే నగర’గా పేర్కొంటూ అక్కడి వ్యవసాయ సంపదను ప్రధాని ప్రశంసించారు. దేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్యను తగ్గించేందుకు ఆహారంలో నూనె వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించాలని ప్రజలకు సూచించారు.