

కూటమి పాలనలో రాజ్యాంగం అపహస్యం: కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా పారదర్శకత లోపించింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల కమిషన్ విధుల్లో కూడా ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం నేతలు రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-ఎస్ఐఆర్)’ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర వైయస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్ఓ) వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు జిల్లా నుంచే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లా మంత్రి నారాయణ ఎలాంటి అధికారిక హక్కులు లేకుండానే జూన్ 22వ తేదీన బూత్ లెవెల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే ప్రోటోకాల్ పక్కన పెట్టేస్తారు. అలాంటిది ఈ సమాఖ్య ప్రక్రియలో మంత్రి ఏ విధంగా జోక్యం చేసుకుంటారు? చంద్రబాబు కేబినెట్‌లో రాజ్యాంగ విలువలు, ప్రొటోకాల్ తెలియని మంత్రులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేదు. కేవలం ‘నారా’ వారి రాజ్యాంగం, రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని ఆయన పేర్కొన్నారు.
కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం
గూడూరు రూరల్ మండలం, చెన్నూరు గ్రామంలో ఎన్యుమరేషన్ డేటాను ముందే టీడీపీ నాయకులకు అందజేస్తున్నారని కాకాణి ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని వైయస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు, దొంగ ఓట్లను ఉంచుకునేందుకు కూటమి ప్రభుత్వం దుర్మార్గపు వ్యూహం రచిస్తోందన్నారు.
మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతూ.. టెలికాన్ఫరెన్స్‌లలో కమిషనర్ నేరుగా టీడీపీ వారితో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓట్లు ఎలా తొలగించాలో, ఐటీడీపీతో కలిసి ఎలా పనిచేయాలో సూచనలు ఇస్తున్నారని విమర్శించారు. కమిషనర్ పచ్చ చొక్కా వేసుకుని తిరగాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి నారాయణ విద్యాసంస్థల్లోనో లేదా టీడీపీ ఆఫీసులోనే కూర్చోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, 2029 తర్వాత వచ్చే ఇబ్బందులను అధికారులు ఊహించుకోవాలని ఆయన హెచ్చరించారు.
కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరిక
ఈ అక్రమాలపై ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ లేళ్ళ అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) కి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆర్టికల్ 324 కింద ఏర్పడిన రాజ్యాంగ వ్యవస్థను కాపాడేందుకు జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ బాధ్యత వహించి స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను తక్షణమే విధుల్లో నుంచి తప్పించాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాకాణి స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించి స్తంభింపజేస్తామని, కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని వైయస్సార్‌సీపీ తరఫున హెచ్చరించారు.
