
కూటమి ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, మూడో ఏడాది కూడా రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ, ఈ ఏడాది కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో దాదాపు 30 లక్షల మంది రైతులు మరోసారి పథకం ప్రయోజనాలకు దూరమయ్యారని తెలిపారు.
మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని, మూడో ఏడాదికి వచ్చేసరికి పథకాన్ని నామమాత్రంగా మార్చిందని షర్మిల విమర్శించారు. అన్నదాత సుఖీభవను సగానికి సగం కుదించారని, పంట నష్టపరిహారం, మద్దతు ధరలు, పంట బీమా అంశాల్లో కూడా రైతులను నిరాశపరిచారని ఆరోపించారు.
అదేవిధంగా, ఎరువుల సరఫరాలో లోపాలు ఉన్నాయని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి వారిని మోసం చేశారని పేర్కొన్నారు. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా కాకుండా భారంగా మార్చాయని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతి రైతుకు రూ.20 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.6 వేల సాయాన్ని కలపకుండా, రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకు రూ.20 వేలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని, లేకపోతే ఎన్నికల హామీలను అమలు చేయనందుకు కూటమి ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆమె కోరారు.
