


హస్తకళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో ‘హస్తకళల పర్యాటకాన్ని’ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026’ను మంగళవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం హస్తకళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ ఆయన పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు.
మహోత్సవంలో రాష్ట్రంలోని కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా, ప్రతి హస్తకళాకృతిపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ వేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీనిని స్కాన్ చేస్తే కళాకారుడి పేరు, ఆ కళ వెనుక ఉన్న పూర్తి కథ తెలిసేలా సాంకేతికతను జోడించాలన్నారు. అలాగే కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రత్యేక వీడియో డాక్యుమెంటరీలను రూపొందించాలని దిశా నిర్దేశం చేశారు. కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. నరసాపురం లేస్ కళాకారులకు కంటి సమస్యలు, చేనేత, కలంకారీ కళాకారులకు వచ్చే కండరాలు, ఎముకలు, శ్వాసకోశ వ్యాధుల నివారణ కోసం క్లస్టర్ల వారీగా నిరంతర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘లేపాక్షి ఈ-కామర్స్ యాప్’ ఆవిష్కరణ
మన రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు వీలుగా ‘లేపాక్షి ఈ-కామర్స్ యాప్’ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, 2 వేల మంది కళాకారులను అధికారిక పారిశ్రామిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా వివిధ క్లస్టర్లలో 100 ‘ఉద్యమ్ వర్క్‌షాపులను’, ‘వీబీ జీ రామ్ జీ’ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించారు.
స్టాళ్ల సందర్శన – కళాకారులకు భరోసా
పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతి స్టాల్‌ను సందర్శించి, హస్తకళలను కొనుగోలు చేస్తూ కళాకారులను ప్రోత్సహించారు. కాకినాడ కళాకారులు ప్రదర్శించిన రామాయణంలోని ‘రావణ సంహార ఘట్టం’ తిలకించి, రాబోయే గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సతీమణి అన్నా కొణిదల కోసం మూడు ఉప్పాడ జాందానీ పట్టు చీరలను, అరటిపీచుతో చేసిన పర్యావరణహిత హ్యాండ్ బ్యాగును కొనుగోలు చేశారు. తిరుపతి స్టాల్ నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి చెక్క ప్రతిమను కొనుగోలు చేశారు. స్కూళ్లలో బ్యాటరీ రహిత సైంటిఫిక్ చెక్క బొమ్మలను ఏర్పాటు చేయాలని, గిరిజన సవర కళలను పురాణ కథలతో తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చేనేత శాఖ సలహాదారు సుచిత్ర ఎల్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
