
రైతులకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం: వైసీపీ నేత వీరశేఖర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతులు, రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్న ఆయన, రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సహాయం చేసిన ఆర్బీకేలు ఇప్పుడు తమ అసలు లక్ష్యాన్ని కోల్పోయాయని అన్నారు. గతంలో రైతులు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరల సమస్యల పరిష్కారం కోసం ఆర్బీకేలను ఆశ్రయించేవారని, ప్రస్తుతం యూరియా, విత్తనాలు, పంటల విక్రయాల కోసం కూడా క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవగా అమలు చేస్తున్నప్పటికీ, లక్షలాది మంది రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందలేదని ఆయన ఆరోపించారు. సున్నావడ్డీ పంట రుణాలు, ఉచిత పంట బీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, శనగ, అరటి, పొగాకు, టమాటా, మామిడి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్వా రైతులు కూడా ఫీడ్ ధరల పెరుగుదలతో నష్టపోతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన ధరల తగ్గింపు పూర్తిగా అమలు కాలేదని అన్నారు. ముఖ్యంగా తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు రోజుల తరబడి క్యూల్లో నిలిచినా కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.369 కోట్లు కేటాయిస్తే మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, కొందరు ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని, రైతులకు సేవలు అందించే వ్యవస్థను ప్రభుత్వం బలహీనపరిచిందని వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
