Let's talk: editor@tmv.in
తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరి: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరి: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
7 మే, 2026

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రవాణా, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, వ్యవస్థీకృత విధానం ప్రకారం ప్రధానికి స్వాగతం పలుకుతామని చెబుతూనే, గత పదేళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు.

గత 12 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు.ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను గత ప్రభుత్వం విస్మరించి ఉండవచ్చు, కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇస్తున్నాం. అయినా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యతను కేంద్ర బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, అభివృద్ధిలో సహకరించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అమరవీరుల త్యాగాలను అవమానించే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ ఏర్పాటును అవహేళన చేయడం, దానిని దేశ విభజనతో పోల్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని గతంలో చెప్పినవారే ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని గుర్తుచేస్తూ, తెలంగాణను ముందుగానే ఇచ్చి ఉంటే ఇంత మంది ప్రాణత్యాగాలు జరిగేవా అని ప్రశ్నించారు.