
కేంద్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది: స్టాలిన్
ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16న నల్లజెండాలతో ఆందోళనలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ బుధవారం పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు.
తమిళనాడుకు చారిత్రాత్మక అన్యాయం: స్టాలిన్
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు తమిళనాడుకు ‘చారిత్రాత్మక అన్యాయం’ కలిగిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలు చేసిన కృషికి ఇదే ప్రతిఫలమా అని ప్రశ్నించారు. వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఇళ్ల వద్ద, ప్రజా ప్రదేశాల్లో నల్లజెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్రం తమిళనాడు అభిప్రాయాన్ని గౌరవించి వెనక్కి తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది రాజకీయ పార్టీల మధ్య పోరు కాదని, ప్రజల హక్కులను రక్షించే పోరాటమని స్టాలిన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు, ఎంపీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అత్యవసర సమావేశం
డీలిమిటేషన్ ప్రభావంపై చర్చించేందుకు స్టాలిన్ పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
దక్షిణ రాష్ట్రాల ఐక్యత
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు స్టాలిన్ ఇప్పటికే ఇతర రాష్ట్రాల నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. గతంలో నిర్వహించిన సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ తదితరులు హాజరయ్యారు. స్టాలిన్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదించారు. కొత్తగా పెరిగే సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన సీట్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వంటి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. డీలిమిటేషన్ అమలు వల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ప్రభావం పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగే అవకాశముందని స్టాలిన్ ఆరోపించారు.
