Let's talk: editor@tmv.in
ప్రజల ఆదాయాన్ని కేంద్రం దోచుకుంటోంది: మల్లికార్జున ఖర్గే

ప్రజల ఆదాయాన్ని కేంద్రం దోచుకుంటోంది: మల్లికార్జున ఖర్గే

Gaddamidi Naveen
24 మే, 2026

దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంధన ధరలను నిరంతరం పెంచుకుంటూ పోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సంపాదనను "విడతల వారీగా దోచుకుంటోంది" ఆయన ఆరోపించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ఈ మేరకు ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలలో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 ల్యాండ్‌మార్క్‌ను దాటేసిందని ఖర్గే గుర్తుచేశారు. కేంద్ర పన్నుల ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం లేదా రాయితీలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేవలం పెట్రోల్, డీజిల్‌లపై విధిస్తున్న పన్నుల ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిరోజూ రూ.1,000 కోట్ల సెంట్రల్ టాక్స్ రెవెన్యూ వస్తోందని, అయినా కేంద్రం "ఆకలి" తీరడం లేదని ఖర్గే ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు, ఆ ఆర్థిక ప్రయోజనాలను దేశ పౌరులకు బదిలీ చేయకుండా ప్రభుత్వం తన వద్దే దాచుకుందని ఆరోపించారు. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయకుండా నిరంతరాయంగా దోచుకున్నారు. సంక్షోభం రాగానే ఎన్నికల్లో మునిగిపోయారు, ఎన్నికలు ముగిసిన తర్వాత త్యాగాలు చేయాలంటూ ప్రజలకు హితబోధ చేస్తున్నారని ఖర్గే తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

విదేశాల ఉదాహరణలతో కేంద్రానికి కౌంటర్

భారతదేశంలో ఇంధన ధరలు విదేశాల కంటే తక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న వాదనలను ఖర్గే గణాంకాలతో తిప్పికొట్టారు. ఇటలీ ఇంధన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని, ఆస్ట్రేలియా పెట్రోల్ ధరలను లీటర్‌కు సుమారు రూ.17 తగ్గేలా చర్యలు తీసుకుందని ఖర్గే ఉదాహరణగా పేర్కొన్నారు. జర్మనీ కూడా ఇంధన పన్నులను తగ్గించడంతో లీటర్‌కు రూ.17–19 వరకు ధరలు తగ్గాయని చెప్పారు. అలాగే యుకే ప్రజలకు ఇంధన సాయం అందించడంతో పాటు విద్యుత్, ఇంధనంపై పన్నులు తగ్గించిందని, ఐర్లాండ్ 250 మిలియన్ యూరోల ప్యాకేజీ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని వివరించారు.

ప్రధాని మోదీకి ఖర్గే సవాల్

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయులకు అంతా బాగుందనే సమ్మోహన మందు ఇస్తూ బిజీగా ఉన్నారని, అదే సమయంలో ఇతర దేశాలు తమ పౌరులను ఆదుకున్నాయని ఖర్గే విమర్శించారు. కేవలం 8 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను మూడుసార్లు పెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విడతల వారీ దోపిడీలో ఎవరెవరికి వాటాలు అందుతున్నాయో? ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అసలైన సంక్షోభం 'నాయకత్వ లోపమేనని' 140 కోట్ల మంది భారతీయులకు అర్థమైపోయిందని ఆయన ముగించారు. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత, హార్ముజ్ జలసంధి సముద్ర వాణిజ్య మార్గంలో ఏర్పడిన ఆటంకాల కారణంగా శనివారం దేశంలో మళ్లీ పెట్రోల్ ధరను 94 పైసలు, డీజిల్ ధరను 95 పైసలు పెంచారు. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మరోసారి పెరిగిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.