
కేంద్రం 30 శాతం కూడా ధాన్యం కొనడం లేదు.. ప్రతి గింజా మేమే సేకరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం, మక్కల (మొక్కజొన్న) కొనుగోళ్లను విజయవంతంగా చేపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనను కలిసిన సీపీఐ, సీపీఎం ప్రతినిధి బృందాలతో ఆయన విడివిడిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తున్నా సరే రైతుల సంక్షేమం కోసమే తాము మొక్కజొన్నను సేకరిస్తున్నామని వెల్లడించారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలో కనీసం 30 శాతం కూడా కేంద్రం కొనుగోలు చేయడం లేదని, ఈ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీల నాయకులతో అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కొనుగోళ్ల ఆలస్యంపై వివరణ
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి స్పందించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో హమాలీలు, కార్మికుల కొరత ఏర్పడిందని.. ఇందుకు కారణం ఇక్కడి కార్మికుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని, అక్కడ ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా వారు తమ సొంత రాష్ట్రానికి వెళ్లారని సీఎం వివరించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం వేళల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రక్రియను నిలిపివేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరున్న ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తుందని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళన, విద్యారంగంపై వ్యాఖ్యలు
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ భవిష్యత్తులో ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుతుందని, అయితే దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేవలం రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని, అందులో భాగంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
కార్మికుల కనీస వేతనాల పెంపు
రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ, సీపీఎం నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కనీస వేతనాల పెంపు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ వేతనాల కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. జోన్–1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్–2లో మున్సిపాలిటీలు, జోన్–3లో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. జోన్–1లో అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.12,750 నుంచి రూ.16,000కు పెంచారు. సెమీ-స్కిల్డ్ కార్మికులకు రూ.13,152 నుంచి రూ.17,000కు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500కు, అత్యంత నైపుణ్యం గల కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20,000కు పెంపు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
