
టీజీఎస్ఆర్టీసీ భరోసా.. రోడ్డు ప్రమాదంలో మరణించినవారికి రూ.కోటి ఆర్థిక సాయం
రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన సంస్థ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ ఆర్థిక సాయాన్ని అందించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం, ప్రమాద బీమా సౌకర్యం ద్వారా బాధితులకు అండగా నిలిచింది. ఇందులో భాగంగా మంగళవారం బస్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మరణించిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు.
ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పిక్కెట్ డిపోకు చెందిన డ్రైవర్ సుధాకర్, పరిగి డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలను పోషించే యజమానులను కోల్పోయి తీవ్ర విచారంలో ఉన్న ఆ కుటుంబాలకు ‘యూనియన్ బ్యాంక్ సూపర్ శాలరీ సేవింగ్స్ అకౌంట్’ కొండంత అండగా నిలిచింది.
టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు యూనియన్ బ్యాంక్ శాఖల్లో శాలరీ అకౌంట్లు తెరిచి, రూపే కార్డులు పొందడం ద్వారా ఈ ఉచిత ప్రమాద బీమా సదుపాయానికి అర్హులవుతారు. ప్రమాదవశాత్తూ ఉద్యోగి మరణిస్తే ఈ పథకం కింద కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మేరకు మరణించిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబ సభ్యులకు రూ. 1 కోటి చొప్పున విలువైన చెక్కులను టీజీఎస్‌ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎమ్. రవీంద్ర బాబు, రీజినల్ హెడ్ డి. వెంకటేశ్వర్లు సంయుక్తంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో కార్మికులకు, వారి కుటుంబాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు సంక్షోభ సమయాల్లో ఎంతో విలువైనవని, ఉద్యోగులందరూ నిర్లక్ష్యం చేయకుండా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కష్టకాలంలో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచినందుకు యూనియన్ బ్యాంక్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
