
290 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు, అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 290 ఖాళీలకు నియామక ప్రక్రియ చేపట్టబడుతోంది.
అభ్యర్థుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సివిల్ ఏఈఈ పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 13 వరకు, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది.
ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం సాధారణ ప్రక్రియగా మారనుందని టీజీపీఎస్సీ పేర్కొంది. నెలకు కనీసం రెండు నుంచి మూడు నియామక ప్రకటనలు విడుదల చేసి, నిరంతర ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పారదర్శక నియామక క్యాలెండర్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ యువతకు స్పష్టమైన సందేశం ఇస్తూ, ఉద్యోగార్థులు నిరంతరం పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ప్రతి నెలా కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నందున అభ్యర్థులు క్రమశిక్షణతో సన్నద్ధం కావాలని టీజీపీఎస్సీ పిలుపునిచ్చింది.
