
టీజీ-రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ (టీజీ-రెరా) చైర్మన్ ఎన్. సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘమైన బెంచ్ విచారణలు, పరిపాలనాపరమైన పని ఒత్తిడి కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన సమర్పించిన రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. 2023 జూన్‌లో టీజీ రెరా చైర్మన్‌గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు.
తాను రాజీనామా చేయడం బాధాకరమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం దృష్ట్యా ఇది తప్పలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సత్యనారాయణ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రభుత్వ సేవలో 'రెరా' చైర్మన్ పదవి అత్యంత సవాలుతో కూడుకున్నది, అలాగే ఎంతో సంతృప్తిని ఇచ్చిన బాధ్యత అని ఆయన అభివర్ణించారు. రోజుకు దాదాపు ఐదు గంటల పాటు నిరంతరాయంగా కేసుల విచారణలు జరపడం వల్ల తనకు తీవ్రమైన నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. గత కొన్ని వారాలుగా దీని కోసం నిరంతరం ఫిజియోథెరపీ, వైద్య చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
సత్యనారాయణ మూడేళ్ల పదవీకాలం - సాధించిన విజయాలు
తన మూడేళ్ల పదవీకాలంలో తెలంగాణ రెరా సంస్థను పారదర్శకతకు, జవాబుదారీతనానికి మారుపేరుగా నిలిపినట్లు సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు. బహుళ రాష్ట్రాల్లోని రెరా విధానాలను అధ్యయనం చేసి డిజిటల్ గవర్నెన్స్, ఫిర్యాదుల పరిష్కారం, కొనుగోలుదారుల రక్షణ వంటి అనేక సంస్థాగత సంస్కరణలు తెచ్చినట్లు చెప్పారు.
ప్రాజెక్ట్ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, చట్టప్రకారం ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌కు నెల రోజుల గడువు ఉన్నప్పటికీ, తెలంగాణ రెరా కేవలం 10 నుంచి 21 రోజుల్లోనే నమోదు పూర్తిచేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 10,817 ప్రాజెక్టులు, అలాగే 5,106 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా పరిధిలో నమోదయ్యారు. దీనితో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. సంస్థాగత పరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 56 మంది అధికారులను డిప్యూటేషన్‌తో పాటు సంస్థను మరింత బలంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం
ముఖ్యంగా 2017 నుంచి 2022 మధ్య కాలంలో పెండింగ్‌లో ఉన్న పాత ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, 2023 తర్వాత వచ్చిన క్రమం తప్పని ఫిర్యాదులతో కలిపి విచారణలు జరిపారు. సంస్థకు వచ్చిన మొత్తం 2,764 ఫిర్యాదులలో ఇప్పటివరకు 1,764 కేసుల్లో విచారణ పూర్తి చేసి తుది ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు ప్రమోటర్ల హక్కుల బదిలీ, ప్రాజెక్ట్ గడువు పొడిగింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రెరా చట్ట నిబంధనల ప్రకారం వాటాదారులందరినీ సమన్వయం చేస్తూ.. నిలిచిపోయిన 'జయా ప్లాటినం', 'జయా డైమండ్' ప్రాజెక్టులను పునరుద్ధరించగలిగారు.
లీగల్ రీసెర్చ్, మధ్యవర్తిత్వం సాంకేతిక మూల్యాంకనాన్ని బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్సీఐ), నల్సార్ లా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే తప్పుదోవ పట్టించే ప్రకటనలను డిజిటల్‌గా పర్యవేక్షించడానికి 'అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' తో చేతులు కలిపారు.
బాధిత వినియోగదారులకు ఫిర్యాదుల దాఖలు, ప్రాజెక్ట్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ సహాయం అందించడానికి ఒక ప్రత్యేక 'పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్' ను కూడా ఆయన హయాంలోనే ప్రారంభించారు. కాగా, సత్యనారాయణ ఆరోగ్య కారణాల దృష్ట్యా సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం అధికారిక మెమో జారీ చేసింది.
