Let's talk: editor@tmv.in
మాలిలో ఉగ్రదాడి.. రక్షణ మంత్రి మృతి

మాలిలో ఉగ్రదాడి.. రక్షణ మంత్రి మృతి

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిహాది మిలిటెంట్లు, వేర్పాటువాదులు కలిసి దేశవ్యాప్తంగా భారీ దాడులకు దిగాయి. ఈ దాడుల్లో మాలి రక్షణ మంత్రి జనరల్ సాడియో కామరా హతమైనట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ విషయంపై మాలి ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

దేశవ్యాప్తంగా దాడులు

శనివారం జరిగిన ఈ దాడులు ఇటీవల కాలంలోనే అతిపెద్ద దాడులుగా భావిస్తున్నారు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా రాజధాని బమాకోతో పాటు మరికొన్ని ప్రధాన నగరాలపై ఒకేసారి విరుచుకుపడటంతో సుమారు 16 మంది పౌరులు, సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాల ఎదురుదాడిలో కొందరు మిలిటెంట్లు కూడా చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయం సహా నాలుగు కీలక ప్రాంతాల్లో తామే దాడులు చేశామని 'జేఎన్ఐఎం' అనే జిహాదీ సంస్థ ప్రకటించుకోవడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది.

కిడాల్‌పై తిరుగుబాటు దళాల ఆధిపత్యం

ఉత్తర మాలిలోని కీలక నగరం కిడాల్‌ను తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. అజవాద్ లిబరేషన్ ఫ్రంట్ ప్రతినిధి మొహమ్మద్ ఎల్ మౌలౌద్ రమదాన్ ప్రకారం, మాలి సైన్యం, రష్యా ఆఫ్రికా కార్ప్స్ బలగాలు శాంతియుత ఒప్పందంతో అక్కడి నుంచి వెనుదిరిగాయి. “కిడాల్ ఇప్పుడు స్వేచ్ఛా ప్రాంతం” అని ఆయన పేర్కొన్నారు. అయితే మాలి సైన్యం ఈ విషయంపై స్పందించలేదు.

రష్యా బలగాలపై విమర్శలు

మాలిలో జరిగిన ఈ ఘోర దాడులు అక్కడ రక్షణగా ఉన్న రష్యా బలగాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఉగ్రవాదులు ఇంత పెద్ద ఎత్తున దాడులకు కుట్ర పన్నుతున్నా కనీసం ముందస్తు సమాచారం తెలుసుకోలేకపోవడం, కీలక నగరాలను కాపాడటంలో విఫలం కావడంతో రష్యా సైన్యంపై నమ్మకం సన్నగిల్లిందని నిపుణులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, పోరాట సమయంలో అసలైన ఉగ్రవాదులెవరో, సామాన్య ప్రజలెవరో గుర్తించకుండా రష్యా దళాలు వ్యవహరించడం వల్ల పరిస్థితులు మరింత దిగజారి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ఫ్యూ విధింపు

పరిస్థితులు అదుపులోకి తేవడానికి బమాకోలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల సమాఖ్య ఈ దాడులను ఖండిస్తూ, ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చింది.

నేపథ్యం

మాలి దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని విడగొట్టి, 'అజావాద్' అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అక్కడి వేర్పాటువాద గ్రూపులు ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నాయి. దీనికి తోడు, గత పదేళ్లుగా అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలు కూడా ప్రభుత్వంపై వరుస దాడులకు తెగబడుతున్నాయి. 2023లో కిడాల్ అనే కీలక నగరాన్ని మాలి సైన్యం, రష్యా బలగాలు కలిసి స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద విజయంగా భావించారు. కానీ ఇప్పుడు వేర్పాటువాదులు, ఉగ్రవాదులు చేతులు కలిపి ఉమ్మడిగా దాడులు చేయడం మాలి రక్షణ వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది.

మాలి, నైజర్, బుర్కినా ఫాసో వంటి ఆఫ్రికా దేశాల్లో సైనిక పాలన మొదలైనప్పటి నుండి, ఆ ప్రభుత్వాలు అమెరికా, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలను పక్కన పెట్టి రష్యా సాయం కోరాయి. రష్యా బలగాలు వస్తే శాంతి పునరుద్ధరింపబడుతుందని ఆశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉగ్రదాడులు తగ్గకపోగా, గతంలో రాజధాని బమాకో విమానాశ్రయం, సైనిక కేంద్రాలపై జరిగిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా అండ ఉన్నప్పటికీ రక్షణ వ్యవస్థ బలహీనపడటం ఇప్పుడు ఆ దేశాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది.