


కొలంబియాలో ఉగ్రదాడి: బస్సులో బాంబు పేలి 13 మంది మృతి
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో తీవ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా హింసతో అట్టుడుకుతున్న నైరుతి ప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అమర్చిన బాంబు పేలడంతో 13 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాకా ప్రావిన్స్‌లోని కాజిబియో సమీపంలో ఉన్న పాన్ అమెరికన్ హైవేపై బస్సు ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. గవర్నర్ ఆక్టావియో గుజ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. క్షతగాత్రుల్లో అత్యధికులు స్థానిక ఆదివాసీ తెగలకు చెందిన వారు కావడం గమనార్హం. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉగ్ర చర్యగా అభివర్ణించిన కొలంబియా ఆర్మీ
ఈ దారుణాన్ని కొలంబియా సాయుధ దళాల కమాండర్ జనరల్ హ్యూగో లోపెజ్ తీవ్రంగా ఖండించారు. ఇదొక అమానుషమైన ఉగ్రవాద చర్య అని ఆయన అభివర్ణించారు. 2016లో ప్రభుత్వంతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ధిక్కరించిన పాత 'ఫార్క్' తిరుగుబాటు గ్రూపులే ఈ దాడులకు పాల్పడుతున్నాయని అధికారులు గుర్తించారు. దేశంలో మోస్ట్ వాంటెడ్ నేరగాడైన ఇవాన్ మోర్డిస్కో నెట్‌వర్క్‌తో పాటు 'జైమ్ మార్టినెజ్' గ్రూపు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సైన్యం ప్రాథమికంగా నిర్ధారించింది.
ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పందిస్తూ, "మనుషుల్ని చంపే వీరు కేవలం నేరస్తులు మాత్రమే కాదు.. సమాజానికి పట్టిన చీడపురుగులు. అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఇలాంటి ఉగ్రవాదులను, డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం ఎంతమాత్రం విడిచిపెట్టదు. ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడటమే మా మొదటి బాధ్యత, దీని కోసం ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడం" అని హెచ్చరించారు.
వరుస దాడులు
గడిచిన 48 గంటల్లో ఈ ప్రాంతంలో సుమారు 26 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. జముండిలోని పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరపడం, ఎల్ టాంబోలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్‌పై బాంబులు అమర్చిన డ్రోన్లతో దాడికి ప్రయత్నించడం, కాలి, పామిరా నగరాల్లో మిలిటరీ కేంద్రాల వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కార్లను పేల్చడం వంటి చర్యలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
డ్రగ్స్ మాఫియా ఆధిపత్య పోరు
ఈ ప్రాంతంలో హింస పెరగడానికి ప్రధాన కారణం మాదకద్రవ్యాల అక్రమ రవాణా అని అధికారులు చెబుతున్నారు. 'బ్యూనవెంచురా' ఓడరేవుకు వెళ్లే మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకోవడానికి వివిధ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మార్గం ద్వారానే మధ్య అమెరికా, యూరప్ దేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంటాయి. ఈ ఆధిపత్య పోరులో సామాన్య పౌరులు బలవుతున్నారు.
కోటి రూపాయలకు పైగా రివార్డు
ఈ దాడుల నేపథ్యంలో కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని ఉగ్రవాద ముఠా నాయకుడు మార్లోన్ ఆచూకీ తెలిపిన వారికి సుమారు 10 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.9 కోట్లు) రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.
