Let's talk: editor@tmv.in
మాలిలో ఉగ్ర విలయం: ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు!
మాలిలో ఉగ్ర విలయం: ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు!
మాలిలో ఉగ్ర విలయం: ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు!

మాలిలో ఉగ్ర విలయం: ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు!

Dantu Vijaya Lakshmi Prasanna
26 ఏప్రిల్, 2026

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా తుపాకుల మోత, బాంబు పేలుళ్లతో వణికిపోయింది. రాజధాని బమాకోతో పాటు దేశంలోని కీలక నగరాల్లో సాయుధ ఉగ్రవాదులు ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. అత్యంత పకడ్బందీగా, సమన్వయంతో జరిగిన ఈ దాడులు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోడిబో కీటా అంతర్జాతీయ విమానాశ్రయం, సమీపంలోని వైమానిక స్థావరం లక్ష్యంగా భారీగా కాల్పులు జరిగాయని స్థానికులు, అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

మాలి సైన్యం ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, "గుర్తుతెలియని సాయుధ ఉగ్రవాద ముఠాలు రాజధానిలోని కొన్ని కీలక ప్రాంతాలు, సైనిక బ్యారక్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి" అని పేర్కొంది. ప్రస్తుతం తమ సైనికులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వారిని తుదముట్టించే పనిలో ఉన్నారని ఆర్మీ స్పష్టం చేసింది. బమాకో నగర కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం వద్ద భారీ ఆయుధాలు, ఆటోమేటిక్ రైఫిళ్ల శబ్దాలు మిన్నంటాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనిక హెలికాప్టర్లు గాలిలో చక్కర్లు కొడుతూ నిఘా ఉంచాయి.

రాజధానిలోనే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో కూడా దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈశాన్య నగరమైన కిడాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు కొన్ని పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడ సైన్యానికి, సాయుధులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయని కిడాల్ మాజీ మేయర్ ఒకరు తెలిపారు. అలాగే మరో కీలక నగరం గావోలో కూడా తెల్లవారుజాము నుంచి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్ల కిటికీలు, తలుపులు కంపిస్తున్నాయని, ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దాడుల వెనుక 'అజావాద్ లిబరేషన్ ఫ్రంట్' ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థ ప్రతినిధి మహ్మద్ ఎల్మౌలౌద్ రామదానే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. కిడాల్, గావో నగరాల్లోని పలు ప్రాంతాలను తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించారు. ఉత్తర మాలిలో ప్రత్యేక 'అజావాద్' దేశం కోసం ఈ వేర్పాటువాద గ్రూపులు గత పదేళ్లుగా పోరాడుతున్నాయి. 2015లో కుదిరిన శాంతి ఒప్పందం విఫలం కావడంతో మళ్ళీ హింసాత్మక ఘటనలు పెచ్చుమీరాయి.

మాలిలో భద్రతా పరిస్థితులు గత దశాబ్ద కాలంగా క్షీణిస్తూ వస్తున్నాయి. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాటు వేర్పాటువాద తిరుగుబాట్లు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పొరుగు దేశాలైన నైజర్, బుర్కినా ఫాసోలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఈ దేశాలు పాశ్చాత్య దేశాల మద్దతు కోరగా, ఇటీవల జరిగిన సైనిక తిరుగుబాట్ల తర్వాత రష్యా సహాయం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మాలిలో ఉగ్ర దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ తాజా దాడుల నేపథ్యంలో మాలి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. రాజధాని బమాకో సమీపంలోని కాటి వంటి సైనిక కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. 2024లో కూడా అల్-ఖైదా అనుబంధ సంస్థ బమాకో విమానాశ్రయంపై దాడి చేసి భారీ ప్రాణనష్టం కలిగించిన విషయం తెలిసిందే. తాజా దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే నెపంతో సాధారణ పౌరులపై కూడా సైన్యం కఠినంగా వ్యవహరిస్తోందని కొన్ని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.