Let's talk: editor@tmv.in
దేశంలో టెర్రర్ కుట్ర భగ్నం..నలుగురు అరెస్ట్

దేశంలో టెర్రర్ కుట్ర భగ్నం..నలుగురు అరెస్ట్

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నిన నలుగురిని భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. గుజరాత్‌లో ఇద్దరిని గుజరాత్‌ యాంటీ–టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్), ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మరో ఇద్దరిని ఢిల్లీ పోలీస్‌ అదుపులోకి తీసుకున్నాయి.

గుజరాత్‌లో ఇద్దరు అరెస్ట్

ఏటీఎస్ ప్రకారం, నిందితులు ‘ఘజ్వా-ఏ-హింద్’ లక్ష్యంతో దేశంలో టెరర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని, ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాలతో దాడులు చేయాలని, ఆర్‌‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న నేతలను లక్ష్యంగా చేసుకోవాలని కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాటణ్ జిల్లా సిద్ధ్‌పూర్‌కు చెందిన ఇర్ఫాన్ కాలేఖాన్ పఠాన్ (22)ను విచారణకు తీసుకుని అతని మొబైల్ పరిశీలించగా, ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులతో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో అతను చురుకుగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పఠాన్ తన సహచరులతో కలిసి యువతను ‘ముజాహిదీన్స్‌’గా నియమించి ఆయుధ వినియోగం, పేలుడు పదార్థాల తయారీపై శిక్షణ ఇవ్వాలని యత్నించినట్లు ఏటీఎస్ తెలిపింది. విదేశాల నుంచి ఆయుధాలు అక్రమంగా తరలించడం, నిధులు సమీకరించడం వంటి ప్రణాళికలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి పఠాన్‌ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ముంబై సాకినాకాకు చెందిన ముర్షిద్ జాహిద్ అక్తర్ షేక్‌ (21) ప్రమేయం బయటపడగా, మహారాష్ట్ర పోలీసుల సహాయంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ 11 రోజుల పాటు ఏటీఎస్ కస్టడీకి కోర్టు పంపింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇద్దరు అరెస్ట్

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రాక్సీతో సంబంధాలు ఉన్న ఇద్దరు ఆపరేటివ్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షహజాద్‌ భట్టి అనుచరులు భారత్‌లో గ్రెనేడ్ దాడులు, టార్గెట్ కిల్లింగ్స్‌కు కుట్ర పన్నినట్లు సమాచారం అందింది. ఈ కేసులో రాజ్‌వీర్‌, వివేక్ బంజారా అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దబ్రా ప్రాంతంలో ఉన్న వివేక్‌ను ఏప్రిల్‌ 16న అదుపులోకి తీసుకోగా, అతని సమాచారం ఆధారంగా రాజ్‌వీర్‌ను ఏప్రిల్‌ 18న ఢిల్లీలోని సరాయ్ కాళే ఖాన్ ప్రాంతంలో పట్టుకున్నారు.

రాజ్‌వీర్ ఢిల్లీ-ఎన్‌సీఆర్లోని ఓ ప్రముఖ హోటల్‌పై కాల్పులు జరపడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్‌, ఆరు లైవ్ రౌండ్లు, కీలక సమాచారం ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ‘రాణా భాయ్’ అనే వ్యక్తి ద్వారా ఈ నిందితులు గ్యాంగ్‌స్టర్ భట్టితో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు తెలిసింది. ఆయుధాల సేకరణ, దాడుల ప్రణాళికలపై వీరు చర్చలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై భద్రతా సంస్థలు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.